పాత సీసాలో కొత్త సారా పోస్తున్నారా?
ఒక ఫార్ములా సక్సెసైతే ఇంచుమించు అదే మూసలో వెళ్లిపోవడం అనాదిగా చూస్తున్నదే. బాలీవుడ్ అయినా.. టాలీవుడ్ అయినా ఈ రూల్ కి అతీతం కాదు. కమర్షియల్ సక్సెస్ రావాలంటే ట్రెండ్ ఎలా ఉంది? అన్నది దర్శకనిర్మాతలు ఫాలో అవుతుంటారు. అలా ఇప్పటికే ఒకే జోనర్ కథల్ని ఎంచుకుని వాటితో హిట్లు కొట్టిన సందర్భాలున్నాయి. ప్రస్తుత ట్రెండ్ ఏదీ? అంటే.. హారర్.. క్రైమ్ జోనర్ కథలకు విపరీతమైన ఆదరణ దక్కుతోంది. వీటికి యాక్షన్ రొమాన్స్ ని జోడిస్తే ఆద్యంతం రక్తి కట్టించేస్తున్నాయి.
పెద్ద తెరపైనే కాదు.. మరోవైపు బుల్లితెర.. ఓటీటీ వెబ్ సిరీస్ ల ట్రెండ్ చూస్తుంటే అక్కడా ఇదే తంతు కనిపిస్తోంది. హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్లు సహా క్రైమ్ జోనర్ కథల్ని రొమాన్స్ ఒక పార్ట్ గా ఎంచుకుని ఆద్యంతం గ్రిప్పింగ్ గా చూపిస్తే బుల్లితెరపైనా ఓటీటీలపైనా పెద్ద సక్సెస్ రేటు కనిపిస్తోంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఓ రెండు సినిమాలు టాలీవుడ్ లో రానున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నాని – సుధీర్ బాబు కథానాయకులుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ `వీ` కథాంశం ఆసక్తికరం. నానీ ఇందులో విలన్ గా నటిస్తుంటే సుధీర్ బాబు పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్లు ఆకట్టుకున్నాయి. నానీ కోసం వేటలో సుధీర్ బాబు అనే కాప్ చేస్తున్న ప్రయత్నాలే ప్రధాన ఇతివృత్తంగా కనిపిస్తోంది. ఇక ఇదే తరహా కథాంశంతో శర్వానంద్ – సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి ఓ సినిమాని తెరకెక్కిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో హీరోలు ఇద్దరూ స్నేహితులుగా కనిపిస్తారట. అయితే ఒక అమ్మాయి వల్ల ప్రాణ స్నేహితుల మధ్య వైరం మొదలువుతుంది. అటుపై ఏం జరిగింది? అన్నదే కథాంశం. ఎలుకా పిల్లి ఆట తరహా కథాంశాలతో ఈ రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి.
ఆసక్తికరంగా ఈ రెండు చిత్రాల్లోనూ అథిదీరావ్ హైదరీ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోనూ ప్రాణ స్నేహితులైన కొమరం భీమ్ – అల్లూరి సీతారామరాజు హిస్టరీలో స్వాతంత్య్రం కోసం ఏం చేశారన్నది చూపిస్తున్నారు రాజమౌళి. ఈ మూవీ థీమ్ లైన్ కి కనెక్టివిటీ ఉంది. ఇంతకుముందు ఎన్టీఆర్ – ఏఎన్నార్.. కృష్ణ- శోభన్ బాబు.. చిరంజీవి- మోహన్ బాబు కాంబినేషన్ లోనూ ఈ తరహా కథాంశాలతో సినిమాలు రక్తి కట్టించాయి. అనంతర కాలంలోనూ స్నేహం వైరం అన్న కాన్సెప్టుకి క్రైమ్ ని జోడించిన సినిమాలు రక్తి కట్టించాయి.
టాలీవుడ్ హిస్టరీని చెక్ చేస్తే ఇంచుమించు ఇంద్రగంటి.. అజయ్ భూపతి ఎంచుకున్న కథాంశాలు చాలానే కనిపిస్తాయి. అయితే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ .. యాక్షన్ రొమాన్స్ ని మిక్స్ చేసి ఆద్యంతం కుర్చీ అంచున కూచోబెట్టేలా సినిమా తీస్తే హిట్టే. పాత సారానే కొత్త సీసాలో పోసినా మెప్పించే ట్యాలెంట్ దర్శకుడికి ఉండాలి అంతే!!