క్రైసిస్‌లో OTT రిలీజ్ పరిశ్రమకు మేలేనా?
వైరస్ వ్యాప్తి తెలుగు చిత్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టివేసింది. అయితే ఇది చిన్న బడ్జెట్ సినిమాలకు ఆశావహ అవకాశాలను కల్పిస్తోంది. ‘ఆన్‌లైన్’ విడుదల అన్న కాన్సెప్ట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఓటీటీ ఏటీటీలు ఇప్పుడు తెలుగు నాటా పాపులరవుతున్నాయి. ముఖ్యంగా మన యూత్ ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నది తాజా సర్వే.
కోవిడ్-19 వ్యాప్తి దాని పర్యవసానంగా లాక్ డౌన్ తెలుగు చిత్ర పరిశ్రమను అల్లకల్లోలంలోకి నెట్టేసినా.. ఇది చిన్న బడ్జెట్ సినిమాలకు కలిసొస్తోంది. నాలుగు నెలలుగా థియేటర్లు మూసివేయటం .. పెద్ద బ్యానర్ సినిమాలు నిలిచిపోవడంతో, చిన్న బడ్జెట్ సినిమాలు ఆన్‌లైన్ విడుదలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. సినిమా థియేటర్లు వెతుక్కోవాల్సిన కర్మ ఇటీవల లేనేలేదు. మల్టీప్లెక్స్‌ల గందరగోళం అసలే లేదు. నాక్కూడా థియేటర్లు ఇవ్వండి అంటూ పెనుగులాడాల్సిన పనే లేదు.
అగ్రశ్రేణి తారలు నటించిన పెద్ద బడ్జెట్ సినిమాలు థియేటర్లను తిరిగి ఓపెన్ అవుతాయని వేచి చూస్తుండగా, చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు వాటిని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా వంటి ఓవర్ ది టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేస్తున్నారు. దీనివల్ల ఏదో ఒకరకంగా రికవరీ సాధ్యపడుతోంది.
చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలపై ఒత్తిళ్లు ఉన్నా..ఈ పరీక్ష కాలంలో OTT ప్లాట్‌ఫాం వారి రక్షణకు అక్కరకు వచ్చింది. OTT వేదికలకు పెరుగుతున్న ప్రేక్షకుల సంఖ్యతో చిన్న సినిమాల శాతం పెరిగింది. చిన్న నిర్మాతలకు అంతో ఇంతో భరోసా దక్కుతోంది. మంచి సినిమా తీస్తే ఎల్లప్పుడూ ప్రధాన స్రవంతి అయిన థియేట్రికల్ విడుదల ద్వారా లేదా ఆన్‌లైన్ మార్గం ద్వారా ప్రేక్షకులను చేరుకోవడం కష్టం కాదని చిన్న నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
“సినిమాలు చూసేటప్పుడు, ప్రేక్షకులు సులువైన విధానం.. సౌలభ్యం కోసం చూస్తున్నారు. ఇంటిల్లిపాదీ సౌలభ్యం ముఖ్యం . మొదటి రోజు సినిమా చూడటం కంటే ఈ విధానమే సౌకర్యవంతంగా ఉంటుంది. కుటుంబం మరియు స్నేహితులతో పాటు క్రొత్త కంటెంట్ ను ఎంజాయ్ చేస్తే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఆవర్ణమవుతుంది“ అని ఓ సర్వేలో ప్రేక్షకులు వెల్లడించారు.
పరిశ్రమ దిగ్గజాలే తట్టుకోలేని దారుణ ప్రభావాన్ని చూపిస్తున్న పైరసీ భయాన్ని పరిష్కరించడానికి OTT ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విడుదల సరైన పరిష్కారం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కళా ప్రక్రియతో సంబంధం లేకుండా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు నాణ్యమైన కంటెంట్‌కు ఒక వేదికగా మారాయి. స్టార్ కాస్ట్ లేదా మార్కెటింగ్‌పై విచక్షణారహితంగా ఖర్చు చేయడం ఇప్పుడు అవసరమే లేదు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లు అందించే అవకాశాలు పెరిగాయి. ఇక్కడ ఉపాధి అంతకంతకు పెరుగుతోంది అని విశ్లేషిస్తున్నారు.