సినీకార్మికలు కొలువుండే చిత్రపురి కాలనీలో కరోనా కలకలం బెంబేలెత్తిస్తోంది. సింగిల్ బెడ్ రూమ్స్ ఉండే ఎల్.ఐ.జీ 17వ భవంతిలో ఒకరికి కొవిడ్ 19 ఉందని తేలడంతో కాలనీ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ప్రస్తుతం చిత్రపురి కాలనీలో కార్మికులంతా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని కమిటీ పిలుపునిచ్చింది. ఎట్టి పరిస్థితిలో బయట తిరగకూడదని ఆంక్షలు విధించింది. కొవిడ్ సోకిన కుటుంబంలో భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్చగా.. భార్యకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ దంపతులకు ఒక పాప ఉందని తెలిసింది. ప్రస్తుతం కాలనీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
అయితే కరోనాను సాధారణ జలుబు దగ్గుగానే భావించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని కుండబద్ధలు కొట్టేశాయి. మరి చిత్రపురి వాసుల్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకుంటుందా? లేక లైట్ తీస్కుంటుందా? అన్నది అటుంచితే కనీసం సినీపెద్దలు అయినా వీరిని కాస్త పట్టించుకుని అప్రమత్తం చేస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తే బావుంటుందేమో! ఇప్పటికే ఆన్ లొకేషన్ పనికి కార్మికుల్లేక నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది స్వస్థలాలకు విలేజీలకు వెళ్లిపోయారు. ఉన్నవారిలోనూ ఆందోళన నెలకొంటే వీరు కూడా పలాయనం చిత్తగించేస్తారేమో! అలాకాకుండా ఆదుకునేదెవరు? అన్నదే ఇప్పుడున్న టాస్క్.
హైదరాబాద్ గచ్చిబౌళి పరిసరాల్లో 16 ఎకరాల విస్తీర్ణంలో చిత్రపరి కాలనీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కాలనీలో సింగిల్ బెడ్ రూమ్స్.. డబుల్ ట్రిపుల్ బెడ్ రూమ్స్ సహా రో హౌసెస్.. డూప్లెక్సులు ఉన్నాయి. ఇందులో సింగిల్ బెడ్ రూమ్స్ లోనే దాదాపు 7-8 వేల మంది నివశిస్తున్నారు. ట్రిపుల్ బెడ్ రూమ్స్ ఫుల్ అయ్యాయి. ఇక మిగిలినవి అండర్ కన్ స్ట్రక్షన్ ఉన్నాయి.