మెగాస్టార్ చిరంజీవి అక్టోబర్ 14న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ భేటీ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ జగన్ బిజీ షెడ్యూల్ కారణంగా వీలుపడలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. చిరంజీవి నిజంగా సైరా నరసింహారెడ్డి సినిమా చూపించాలని ఆహ్వానించడానికి వెళ్తున్నారా? లేక ఇందులో రాజకీయ కోణం ఉందా? జనసేన-వైకాపా పార్టీలు పాము -ముంగిసలా ఉన్న నేపథ్యంలో చిరు కలవాల్సిన అవసరం ఏంటి? అని రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
తాజాగా వాటన్నిటిపై మంత్రి బోత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. చిరంజీవి-జగన్ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవు. కేవలం సైరా సినిమా పరంగానే ఈ చర్చలు జరుగుతాయని తెలిపారు. దీంతో చిరు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళీ సై ని ఆహ్వానించినట్లుగానే జగన్ ను సైరా షో కోసం ఆహ్వానించనున్నారని అర్థమవుతోంది. సైరాపై ముఖ్యమంత్రి స్పందన కోరనున్నారు. ఇద్దరి భేటికి బోత్స నే కీలక పాత్ర వహిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి సమయంలో వివరణ ఇవ్వాల్సింది చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు. కానీ నేరుగా బొత్స రంగంలోకి దిగడం ఆశ్చర్యంగానే ఉంది.