అల్లు అర్జున్ 20 చిత్తూరు నేటివిటీతో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏఏ19 టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అల వైకుంటపురములో అనేది సినిమా టైటిల్. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ పూర్తవుతోంది. ఈ సినిమా పెండింగ్ చిత్రీకరణను వేగంగా పూర్తి చేసి తదుపరి ఏఏ 20, ఏఏ 21 చిత్రాలపై బన్ని దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏఏ 21 చిత్రానికి ఐకన్ అనే టైటిల్ ని ప్రకటించారు. ఆదిత్య శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఏఏ 20 సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే.
బన్ని పోలీసాఫీసరా.. స్మగ్లరా?
అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుంది అన్నదానికి తాజాగా సమాచారం తెలిసింది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు ముగింపులో ఉన్నాయి. అక్టోబర్ 3 న హైదరాబాద్‌లో సినిమాని ప్రారంభించి అదే నెల 15 నుంచి పదిహేను రోజుల పాటు తొలి షెడ్యూల్‌ని తెరకెక్కిస్తారట. ఎర్రచందనం స్మగ్లర్ల బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్ని పోలీస్ అధికారిగా నటిస్తారా లేక స్మగ్లర్ గానే కనిపిస్తారా అన్నది సస్పెన్స్. ఈ సినిమా కోసం ఇప్పటికే లొకేషన్లను సెర్చ్ చేశారు. చిత్తూరు యాస ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎర్రచందనం దొంగల కథలపై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మరో చక్కని కాన్సెప్టు ఉన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని సుకుమార్ మెస్మరైజ్ చేస్తారట. ఇంతకుముందు రంగస్థలం కోసం గోదావరి యాసను ఎంపిక చేసుకుని గోదారి పరిసరాల్లో సినిమా ఆద్యంతం తెరకెక్కించిన సుకుమార్ ఈసారి చిత్తూరు- తిరుపతి- సీమ పరిసరాల భాష, యాస, వేషం అన్నిటినీ చూపించనున్నారట. ఈ సినిమాకి టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. ఆదిత్య శ్రీరామ్, సుకుమార్ ఇద్దరి సినిమాల్ని సైమల్టేనియస్ గా తెరకెక్కిస్తారని తెలుస్తోంది.