స్టైలిష్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలలోను విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు హిందీలోను విడుదలై ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంటాయి. బన్నీ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం బన్నీ సినిమాలకు ఫిదా అవుతుంటారు. గత ఏడాది విడుదలైన అల వైకుంఠపురములో సినిమాలు బన్నీ అద్భుతమైన డ్యాన్స్ చేసి అదరగొట్టగా, ఆయన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ప్రస్తుతం బన్నీ పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించి లుక్ విడుదల కాగా, ఇది ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆగస్ట్ 13న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ సినిమాలపై ప్రత్యేక అభిమానమే కాదు ఆయనతో నటించాలని కథానాయికలు ఆశగా ఎదురు చూస్తుంటారు. కన్నుగీటుతో కోట్లాది ప్రేక్షకుల మనసులు దోచుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ కు కూడా అల్లు అర్జున్ తో నటించే ఛాన్స్ వచ్చిందని, ఆ ఆఫర్ ని ఈ అమ్మడు సున్నితంగా తిరస్కరించిందని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా స్పందించిన ప్రియా ప్రకాశ్.. అల్లు అర్జున్ అంటే నాకు అభిమానం ఎక్కువ. మలయాళంలో డబ్ అయిన సినిమాలు చూస్తూ పెరిగాను. అల్లు అర్జున్ సినిమా అంటే తప్పక నటిస్తాను. నాకు బన్నీ సినిమా ఆఫర్ వచ్చిందని, దానిని నేను రిజెక్ట్ చేసిందని వచ్చిన వార్తలలో ఏ మాత్రం వాస్తవం లేదంటూ ప్రియా క్లారిటీ ఇచ్చింది. ఈ అమ్మడు నటించిన చెక్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.