డబ్బిచ్చారా? సినిమాలిప్పించారా?: పవన్‌ కు అలీ కౌంటర్

‘అలీ కష్టాల్లో ఉంటే సాయపడ్డాను అని మీరంటున్నారు..ఏం సాయ చేశారు? డబ్బిచ్చారా? సినిమాలు లేక ఇంట్లో కూర్చుంటే తీసుకెళ్లి సినిమా అవకాశాలు ఇప్పించారా?’ అని సినీ నటుడు, వైకాపా నేత అలీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించటం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజమహేంద్రవరంలో ప్రచారంలో భాగంగా కల్యాణ్‌ అలీపై కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై అలీ ఈ రీతిలో ఘాటుగా స్పందించారు. ఈమేరకు సోమవారం రాత్రి అలీ ఒక వీడియోను విడుదల చేశారు.

ఆ వీడియోలో…‘‘పవన్‌కల్యాణ్‌గారు రాజమండ్రిలో మీరు ఒక చిన్న కామెంట్ చేశారు. సర్‌..! నేను పుట్టి పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకు ఏదైనా చేస్తే బాగుంటుందని నా తండ్రి పేరు మీద ట్రస్ట్‌ పెట్టి, కులమతాలకు అతీతంగా పేదలకు సేవ చేస్తున్నా. ఆ సమయంలో నా గురించి మాట్లాడాలన్న ఆలోచన మీకు రాకపోయినా, మీ చుట్టు పక్కల ఉన్న వాళ్లు ‘అలీ గురించి ఒక కామెంట్‌ చేయండి. రాజమండ్రి కదా బాగుంటుంది’ అని చెప్పి ఉంటారు.

మీరు వేరే ఏ జిల్లాలో నా గురించి కామెంట్‌ చేసినా, నేను స్పందించేవాడిని కాదు. ఎందుకంటే, చిరంజీవిగారు వేసిన బాటలో మీరు వచ్చారు. కానీ, నా బాట నేనే వేసుకున్నా. నా బాటలో నేనే నడిచా, నాకు ఎవరి సపోర్ట్‌ లేదు. చెన్నై నాకు జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో కృషి చేస్తే, నేను ఈ స్థాయిలో ఉన్నా. నా వల్ల ఎవరైనా లాభం పొందారు తప్ప. నేను ఎవరి వద్దా చేయి చాపలేదు. నేను ఎవరినీ ఏమీ అడగలేదు.’’అన్నారు.

‘‘అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయ పడ్డా’ అన్నారు. ఏ విధంగా సాయపడ్డారు? డబ్బిచ్చారా? నాకు సినిమా అవకాశాలు ఇప్పించారా? మీరు ఇండస్ట్రీకి రాకముందే నేను మంచి స్థానంలో ఉన్నా. నేను ఎవరి దగ్గరకు వెళ్లి, ‘అయ్యా నాకు సాయం చేయండి’ అని అడగలేదు. ఆ అల్లా దయ వల్ల చాలా బాగున్నా. ఒకవేళ అడిగే అవకాశం వస్తే, అప్పటికి అలీ ఉండడు. ఆకలితో చచ్చిపోతాను తప్ప. వెళ్లి అడుక్కోను.

ఆ విషయం మీకూ తెలుసు. ఎవరి మనసు నొప్పించేలా.. నేను మాట్లాడను. కానీ, మీరు ఆ మాట అనడం బాధేసింది. వైసీపీలోకి వెళ్లడం తప్పేంటి? రాజకీయ పార్టీలోకి వచ్చాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. నేను ఇప్పటివరకూ చాలా సభల్లో పాల్గొన్నా కానీ, ఎక్కడా మీ గురించి, మీ పార్టీ గురించి ఒక్క కామెంట్‌ కూడా చేయలేదు. ఎందుకంటే గతంలో చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. మీకు నా గుండెల్లో స్థానమిచ్చా. కానీ, మీరు చాలా పెద్ద మాట మాట్లాడేశారు.’’

 పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టినపుడు తాను ఆయన కార్యాలయానికి వెళ్లి ఖురాన్‌ ప్రతిని, ఖర్జూరాలను ఇచ్చి అభినందించి వచ్చానన్నారు. ‘నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరకూడదా ? అదేమైనా తప్పా? రాజ్యాంగ విరుద్ధమా?’ అని అలీ పవన్‌ను ప్రశ్నించారు. తన చుట్టం టికెట్‌ అడిగితే ఇచ్చానని, అలాంటిది అలీ అడిగితే ఇవ్వనా అని పవన్‌ వ్యాఖ్యలు చేశారని… తన ఫోన్‌ నంబర్‌ ఆయన వద్ద లేదా? అని అలీ ప్రశ్నించారు.

మీరు ఏ రోజైనా నాకు ఫోన్‌ చేసి, ‘అలీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?నేను పార్టీ పెట్టా. నా పార్టీలోకి రా’ అని అడిగారా? అడగనప్పుడు ఎందుకు సర్‌ కామెంట్‌ చేయడం.. నాకు చాలా బాధగా ఉంది. క్షమించడి.. ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చారు.