#క‌రోనా.. ఒక జర్నలిస్టు చావు కథ

             అన్నా.. నన్ను బతికించండి అన్నా.. ఊపిరి ఆడటం లేదన్నా.. ఇంజెక్షన్ చేయించండి అశోక్ అన్నా.. డాక్టర్ కి ఫోన్ చేయండి అన్నా.. భయమేస్తోంది అన్నా..చచ్చిపోతానేమో అన్నా..ప్లీజ్ అన్నా..
                                                                     
      తెల్లవారుజాము 3.48నిమిషాలకు  వచ్చిన ఫోన్ లోమధుసూదన్ రెడ్డి  చెప్పిన మాటలు ఇవి..నీకు ఏమీ కాదు..నీకు తగ్గిపోతుంది. భయపడొద్దు..ఇప్పుడేమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాను.        
                                                                                                   
 .ఏమో అన్నా.. ఇక్కడ ఉండలేకపోతున్నా..ఇంజెక్షన్  చేయించండి అన్నా..                                                                                                    
                                                                                         
వెంటిలేటర్ లేదా అని అడాగాను..ఉందన్నా..కానీ ఊపిరాడడం లేదన్నా..డాక్టర్ కి చెప్పండి అన్నా..అన్నాడు                                       ఓకే డాక్టర్ తో ఇప్పుడే మాట్లాడతాను..టెన్షన్ పడకండి అని చెప్పాను..కానీ అతని మాటల్లో ఆయాసంతో కూడిన వణుకు స్పష్టంగా వినిపిస్తోంది.. ఏంచేయాలో అర్థం కాలేదు… వెంటనే తిరుపతి ఎన్టీవీ రిపోర్టర్ కార్తీక్ కి ఫోన్ చేశాను.. మధు ఇలా అంటున్నాడు ఏం చేద్దాం గురూ ఇప్పుడు అన్నాను..                                                            
                                                                                                     
 నాకు కూడా చేశాడు అన్నా.. డ్యూటీ డాక్టర్ తో మాట్లాడాను..వెంటిలేటర్ కూడా ఉందని డాక్టర్ కూడా అన్నాడు కానీ మధు తనకు ఏదో అయిపోతానని బతకనేమోనని భయపడుతున్నాడు అన్నా.. రాత్రి పదకొండు గంటలవరకూ అతనితో మాట్లాడుతూనే ఉన్నాను..ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాను..డాక్టర్లకు టచ్ లోనే ఉన్నాను. తనకి కరోనా వల్ల వచ్చిన ఇబ్బంది కంటే భయం వల్లే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు..అతని పదేపదే ఫోన్లు చేసి ధైర్యం చెప్పండి సరిపోతుందని అని డైరెక్టర్ వెంగమాంబ గారు కూడా అన్నారు ..అని కార్తీక్ చెప్పాడు..                  
                                                               
                 …..మళ్లీ మధుకి ఫోన్ చేశాను..నీకు కొద్దిసేపట్లోడాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తామన్నారు..నీకు తగ్గిపోయింది అసలు నీకొచ్చిన ఇబ్బందేమీ లేదని డాక్టర్లు చెబుతున్నారు..అస్సలు భయపడొద్దు అని చెప్పాను..                                                                        ……………….సరే అన్నా.. ధ్యాంక్స్ అన్నా..ఇంజెక్షన్ ఇస్తే బతికిపోతాను అన్నా..అన్నాడు అదే ..అతని నుంచి విన్న చివరి మాట..సాయంత్రానికి ఫోన్. ..వచ్చింది మధు చనిపోయాడని..                 తెల్లవారుజాము మాట్లాడిన వ్యక్తి సాయంత్రానికి మూగబోయాడు.. కడప ఎన్టీవీ రిపోర్టర్ బొజ్జామధుసూదన్ రెడ్డి కరోనాతో నాలుగురోజుల పాటు పోరాడి అలసిపోయి శాశ్వతంగా నిద్రపోయేముందు మాతో జరిపిన సంభాషణ..                                                                                           ………………….ఉదయం మాట్లాడిన వ్యక్తి సాయంత్రానికి చనిపోయాడంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి..తోటి జర్నలిస్టు మిత్రుడు..కళ్లముందే ప్రాణాలు ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి..నిజానికి ముధుసూధనరెడ్డితో నాకు అంతగా పరిచయం లేదు.. పులివెందులలో వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు తొలిసారి మధుతో కలిసాను..చూడడానికి భారీ ఆకారంతో ఖద్దరు దుస్తులతో అచ్చు రాజకీయనాయకుడిలా, సినిమాల్లో చూపించే ఫ్యాక్షనిస్టులా అనిపించాడు.. కానీ కాసేపు మాట్లాడితే  అతని చిన్నపిల్లాడి మనస్తత్వం అర్థమైంది..                                                                            …………….. ఆ తర్వాత అతనితో మాట్లాడింది చాలా తక్కువ.. ఎప్పుడైనా ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారన్నా అనేవాడు..కడప ఎప్పుడు వస్తారన్నా అని ఆప్యాయంగా అడిగేవాడు..                                           ……………………నాలుగురోజుల క్రితం వాట్సాప్ లో ఎవరో ఫార్వార్డ్ చేసిన మెసేజ్ చూశాను.అది బెడ్ మీద పడుకున్న మధు ఫొటోతో పాటు వాయిస్ కూడా ఉంది. అందులో కడప ఫాతిమా ఆసుపత్రిలో సరిగా ట్రీట్మెంట్ చేయడం లేదు..నాకు ఏదైనా జరిగితే అందుకు ఫాతిమా డాక్టర్లే బాధ్యత వహించాలి.ఎవరైనా స్పందించి నాకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి అనే వాయిస్ ఉంది..                                   ………………….వెంటనే మధుసూదన్ కి ఫోన్ చేశాను,..ఇప్పుడు ఎలా ఉందండీ అని.. కొంత ఆయాసంగానే మాట్లాడుతున్నాడు..అన్నా ముందు ఎవరూ నన్ను పట్టించుకోలేదు..కానీ కడపలో ఉన్న మన మీడియా రిపోర్టర్లు, కెమేరామెన్లు అంతా కలిసి అధికారులతో మాట్లాడారు అప్పటి నుంచి బాగానే చేస్తున్నారన్నా..ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు.. సరే ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అన్నాను..నిజానికి అతను మళ్లీ ఫోన్ల చేస్తాడని గానీ చేయాల్సిన అవసరం వస్తుందని కానీ అనుకోలేదు.. మర్చిపోయాను కూడా..                                                                                    ………………మళ్లీ బుధవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఫోన్ చేశాడు..అన్నా..కడప నుంచి నన్ను పద్మావతి ఆసుపత్రికి పంపించారు అన్నా..ఇక్కడ జాయిన్ అయ్యాను..వీలైతే ఇక్కడ మీకు తెలిసిన డాక్టర్లకు చెప్పు అన్నా.. అన్నాడు..                                      ………………..నాకు అతను చెప్పింది పద్మావతి నిలయం లో ఉన్న కోవిడ్ సెంటర్ అనుకుని అక్కడి ఇన్ చార్జ్ లక్ష్మిగారికి ఫోన్ చేసాను.. ఆవిడ వెంటనే స్పందించి ఇక్కడికి కడప నుంచి పేషంట్ ఎవరూ రాలేదండీ బహుశా పద్మావతి ఆసుపత్రి అయి ఉండవచ్చు అన్నారు..మళ్లీ మధుకి చేసి మీరు ఉన్నది ఏ ఆసుపత్రిలోనే కనుక్కుని చెబుతారా అంటే ఎవరినో అడిగి.. పద్మావతి ఆసుపత్రిలోనే అన్నా..స్విమ్స్ వెనుక అంట అన్నాడు..                                           ………………….ఆ వెంటనే మా తిరుపతి రిపోర్టర్ రాజుని స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబ గారితో మాట్లాడి మధు విషయం చెప్పమన్నాను.. ఆ తర్వాత వెంగమాంబగారితో మాట్లాడాము..ఆవిడ బాగా స్పందించారు.. మధుకి వెంటిలేటర్ ఏర్పాటు చేయించారు..బాగానే కోలుకుంటారు వేరే ఏ సమస్యలు లేవు అని కూడా చెప్పారు.. కాకపోతే బాగా భయపడిపోతున్నారు..కాస్త అందరూ ఫోన్ చేసి ధైర్యం చెప్పండి …అన్నారు.                                                                                                  ………………ఆ తర్వాత ఎందుకైనా మంచిదని స్విమ్స్ పీఆర్వో ఫణికి ఫోన్ చేశాను..అతను కూడా వెంగమాంబగారితో మాట్లాడాడు..అంతేగాదు నా దగ్గర మధు నంబర్ తీసుకుని నాలుగుసార్లు కాల్ చేశాడు..కానీ మధు ఫోన్ ఎత్తడం లేదని చెప్పాడు..    ………………………..……….                                                                                             మళ్లీ గురువారం మధ్యహ్నం మళ్లీ మధునే ఫోన్ చేశాడు..అన్నా ఊపిరాడడం లేదన్నా..నన్ను డిశ్చార్జ్ చేస్తే హైదరాబాద్ కానీ, చెన్నైగానీ వెళ్లిపోతానన్నా..ఇక్కడ ఉండలేను అన్నాడు. అంతేగాదు తనని ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి పంపించేయండి అంటూ మధ్యహ్నం 2.57కి వాట్సాప్ ఆడియో పంపాడు..                              ……………సరేనని మళ్లీ వెంగమాంబగారికి ఫోన్ చేస్తే ఆమె స్పందించి డాక్టర్ భార్గవ్ ని మధు దగ్గరకు పంపారు. ఆయన వెంటనే అన్నీ చెక్ చేసి వెంటిలేటర్ కూడా ఉంది కానీ విపరీతంగా యాంగ్జైటీకి భయానికి గురవుతున్నాడు..తనకు ఏదో అయిపోతుందని బాగా ఆందోళన చెందుతున్నాడని చెప్పారు. అప్పుడు ఆవిడ కూడా కావాలంటే డిశ్చార్జ్ చేసేస్తాను.. వెళ్లిపోవచ్చు..కాకపోతే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇప్పుడు కావాల్సింది మానసికి స్థైర్యం మాత్రమే అదే ఆయనకు మందు ..ఇంకే సమస్య లేదన్నారు.                                                               …………….అటు ఎన్డీవీ రిపోర్టర్ కార్తీక్ కూడా వెంగమాంబగారితో మాట్లాడాడు..మీరు ఏదైనా ఆసుపత్రికి ప్రిఫర్ చేస్తే అక్కడికి మార్చేస్తామని అడిగాడు.. అప్పుడు కూడా ఆవిడ అదే చెప్పారు..
ఇప్పుడు ఆసుపత్రులు మార్చి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అన్నారు.. ఇలాగే విపరీతంగా టెన్షన్ పడితే ఎవరూ ఏమీ చేయలేరన్నారు..                                                                               …………….అటు కార్తీక్ ఇటు నేను ఇద్దరం మళ్లీ మధుకి ఫోన్ చేసి ధైర్యం చెప్పాము..అవసరమైతే అమర్ రాజా వాళ్ల ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చాము..అంతా బాగానే ఉందనుకున్నాము..కచ్చితంగా కోలుకుంటాడని బావించాము.. ఎందుకంటే ఆ తర్వాత మధుతో మాట్లాడినప్పుడు అతను కూడా చెప్పాడు..అన్నా ఇప్పుడు అందరూ బాగా చూసుకుంటున్నారు..డాక్టర్లు కూడా చాలాసార్లు వచ్చి వెళ్తున్నారు .. ఇప్పుడు ఓకే అన్నా.. అని కూడా అన్నాడు..                                            ………………………ఊహించని విధంగా శుక్రవారం తెల్లవారుజాము 3.48కి మళ్లీ అతనిదే ఫోన్ కాల్… అన్నా ఊపిరి ఆడడం లేదు ..నాకేదో అయిపోతోంది.. నన్ను బతికించండి అన్నా ..ఇంజెక్షన్ చేయించండి అన్నా అన్నాడు…. అప్పటికే అతను కార్తీక్ కి కూడా ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాడు.  ఆ టైంలో కూడా కార్తీక్ ఆసుపత్రికి కాల్ చేసి నైట్ డ్యూటీ డాక్టర్లకు ఫోన్ చేయడం వాళ్లు వెళ్లి మధుని చెక్ చేసి వచ్చారు.. మళ్లీ డాక్టర్లు అదే సమాధానం చెప్పారు..అతను విపరీతంగా భయపడిపోతున్నాడు..వెంటిలేటర్ కూడా ఉంచుకోవడం లేదన్నారు.           …………………………………..                                                                          ……………………ఆ తర్వాత ఉదయం ఎలా ఉందో తెలుసుకుందామని మధుకి ఫోన్ చేశాను..కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు..బహుశా పడుకున్నాడేమో అనుకున్నాను..                                                    ………………………..…..సాయంత్రం కార్తీక్ నుంచి ఫోన్ వచ్చింది..అన్నా..భయం మధుని చంపేసింది అన్నా అన్నాడు.కాసేపు ఏం చెప్పాడో అర్థం కాలేదు..మన రిపోర్టర్ మధు చనిపోయాడన్నా…స్విమ్స్ వాళ్లు ఫోన్ చేసి చెప్పారు అన్నాడు..        ……………………….అప్పుడే స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబగారికి మళ్లీ కాల్ చేశాను.మేడమ్ ఏం జరిగిందని.. నిజానికి మధుకి పెద్దగా సమస్య ఏమీ లేదండీ ..కానీ అతను విపరీతమైన టెన్షన్ కు గురయ్యాడు..తాను బతకనని పదే పదే అనేవాడు..వెంటిలేటర్ పీకేసేవాడు. నీకేమి కాదని చెప్పినా సరే…ఓవర్ టెన్షన్ ఫీలయ్యేవాడు.. ఈ కరోనా టైంలో మాకు ఇదో కొత్త ఛాలెంజ్.. ఎందుకంటే కరోనా కంటే భయంతోనే చనిపోతున్నారు..ఇక నుంచి కరోనా పేషంట్ల విషయంలో మేముకూడా నేర్చుకోవాల్సిన కొత్త విషయం ఇది.. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడలేకపోయాము అన్నారు..                                                        ………………………...ఉదయం నన్ను బతికించండి అన్నా.. అని పదేపదే అన్న మధు మాటలే ఇప్పటికే చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి..జీవితం ఎంతటి దారుణమైందో చూడండి..కళ్లముందే మనిషి చనిపోయినా కనీసం ..కడసారి చూడడానికి వెళ్లలేని థీనపరిస్థితి.. .. చావు భయం అతనిదైతే అతని చూడడానికి కూడా వెళ్లలేని బతుకు భయం మాది..  కానీ మధు మరణంతో మనమంతా నేర్చుకోవాల్సిన అంశం ఒకటి ఉంది..

“” పోరాడాల్సింది కరోనాతో కాదు..భయంతో”””

– అశోక్ వేములపల్లి