లారెన్స్ ట్ర‌స్ట్‌కి షాక్.. 21 మందికి క‌రోనా

హీరో కం డైరెక్ట‌ర్.. కొరియోగ్రాఫ‌ర్ కం సోష‌ల్ వ‌ర్క‌ర్.. ఇలా ఏ కోణంలో చూసినా లారెన్స్ మాస్టార్ గొప్ప‌త‌నం గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. ప్ర‌కృతి వైప‌రీత్యాల వేళ అత‌డు చూపించే మాన‌వ‌త‌కు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అభిమానులే కుళ్లుకుపోతారు. అంత‌టి గొప్ప ధాతృత్వం అత‌డి సొంతం. అటు చెన్న‌య్ స‌హా హైద‌రాబాద్ లో ఎంద‌రో అనాధ పిల్ల‌ల్ని అక్కున చేర్చుకుని చ‌దివించే ఏర్పాట్లు చేస్తున్నారు లారెన్స్. లారెన్స్ ట్ర‌స్ట్ సేవా కార్య‌క్ర‌మాల‌కు గొప్ప గుర్తింపు ఉంది. సౌత్ లోనే ఇంత ఉదారంగా దాన‌గుణం ఉన్న హీరో వేరొక‌రు లేర‌న్న‌ది స‌ర్వే.

అయితే లారెన్స్ కి ఊహించ‌ని షాక్ త‌గిలింది. చెన్న‌య్ చెన్న‌య్ అశోక్ న‌గ‌ర్ అనాధాశ్ర‌మంలోని (లారెన్స్ ట్ర‌స్ట్ లో) ఏకంగా 21 మందికి క‌రోనా వైర‌స్ సోక‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ విష‌యం తెలిసిన లారెన్స్ షాక్ లోకి వెళ్లార‌ట‌. తాజాగా చెన్నై కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికి వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. లారెన్స్ ట్రస్ట్ లోని సిబ్బందికి చేశారు. వీరిలో ఏకంగా 21మందికి మహమ్మారి సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. 18మంది పిల్లలకి.. ముగ్గురు ఉద్యోగులకు వ్యాధి సోకింది. వీరందరినీ చెన్నైలోని లయోలా కాలేజీ వైద్య శిబిరానికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ప్ర‌స్తుతం చెన్న‌య్ ని కొవిడ్ 19 మ‌హ‌మ్మారీ ఒణికిస్తోంది. ఎవ‌రికి వైర‌స్ సోకిందో క‌నిపెట్ట‌లేని ధైన్యం నెల‌కొంది. ముంబై – పూణే త‌ర్వాత చెన్న‌య్.. హైద‌రాబాద్ లో ప‌రిస్థితి దారుణంగానే ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.