ప్రస్తుత పరిస్థితులతో, కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో, సినిమా షూటింగ్‌లను ఎప్పుడైనా కిక్‌స్టార్ట్ చేయడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. టీకా కానీ వ్యాక్సీన్ కానీ రాలేదు. అలాంటప్పుడు రిలీజ్ లు ఎలా సాధ్యం? థియేటర్లు తెరిచేదెలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత సులువేవీ కాదు.
మరో రెండు మూడు నెలలు అన్న ప్రచారం సాగుతున్నా.. అప్పటికీ వైరస్ వదిలేట్టు లేదు. కొంతమంది నిర్మాతలు మొదట్లో దసరా రిలీజ్ కోసం వేచి చూడాలనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతి 2021 నాటికైనా రిలీజ్ లకు ఆస్కారం ఉంటుందని భావించారు. ప్రస్తుతం వైరస్ విజృంభణ చూస్తుంటే ఇప్పట్లో ఆ ఆశలేవీ లేనట్టే.
2021 వేసవికి ముందు టాలీవుడ్ రిలీజ్ లేవీ ఉండవు. అసలు షూటింగులు కూడా కష్టమేనని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ లో ఏదీ జరగదన్న క్లారిటీతో పలువురు చిత్రనిర్మాతలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. కరోనావైరస్ కోసం టీకా ముగిసేలోపు థియేటర్లు తెరవడం కుదరదని డిస్ట్రిబ్యూటర్ గా మారిన ఓ నిర్మాత చెప్పారు. ఒకవేళ తెరిచినా జనాలు రాకపోతే తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
కొంతమంది నిర్మాతలు కూడా ప్రజలు థియేటర్లకు వస్తారన్న నమ్మకంతో లేరు. అందువల్ల తమ సినిమాలను విడుదల చేయడానికి ధైర్యం చేయరు. 2021 మొదటి త్రైమాసికంలో టీకా రాకతో, టాలీవుడ్ వచ్చే ఏడాది వేసవిలో వరుస విడుదలలకు ప్లాన్ చేస్తారని భావిస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గితే ఫిల్మ్ షూటింగులు తిరిగి సంక్రాంతి తర్వాతే ప్రారంభించే వీలు కలగవచ్చు. 2020 టాలీవుడ్ కి ఏ రకంగానూ కలిసి రాలేదు. బ్యాడ్ ఇయర్ గా మిగిలిపోయినట్టే.