కరోనాపై వ్యాక్సిన్ నిజంగానే పనిచేస్తోందా.?

దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గిన మాట వాస్తవం. కానీ, రోజువారీ కేసులు 40 వేలకు దిగి వచ్చాక.. అంతకన్నా కాస్త తగ్గాక, మళ్ళీ 40 వేలకు చేరుకుని.. అక్కడే స్థిరంగా వుండిపోవడం కొత్త భయాలకు కారణమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా టెస్టింగ్ కిట్లు విరివిగా అందుబాటులోకి వచ్చేయడంతో, ఇంటి వద్దే టెస్టులు చేసేసుకుని, సొంత వైద్యం చేసేసుకుంటున్నారు చాలామంది. ఆ కారణంగా అసలు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యకీ, అధికారికంగా వెల్లడవుతున్న కేసుల సంఖ్యకీ పొంతన వుండడంలేదు. గడచిన రెండు వారాలుగా ఆసుపత్రుల్లో సీరియస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఇది ప్రమాదకర స్థాయికి చేరుతుందా.? అన్న అనుమానాలైతే పెరుగుతున్నాయి. రెండో వేవ్ ఇంకా పూర్తిగా తగ్గకుండానే మూడో వేవ్ మొదలయ్యిందా.? అన్న విషయమై వైద్య నిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనంతటికీ కారణం, ప్రజలు కరోనా నిబంధనల్ని పాటించకపోవగమేనన్నది వైద్య నిపుణుల వాదన. మరి, వ్యాక్సిన్ల మాటేమిటి.? రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినా, కరోనా నుంచి పూర్తి రక్షణ కలుగుతుందన్న గ్యారంటీ లేదు. అయితే, తీవ్రస్థాయి అనారోగ్యం మాత్రం తప్పుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా, వ్యాక్సినేషన్ పొందనివారి నుంచి ఎలాగైతే ఎక్కువమందికి కరోనా వ్యాప్తి చెందుతుందో, వ్యాక్సిన్ పొందినవారి నుంచి కూడా అదే స్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెండు డోసుల వ్యాక్సినేషన్ పొందినవారు, ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తుండడంతోనే కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంలేదన్నది ఓ బలమైన అభిప్రాయం. అంతే తప్ప, వ్యాక్సిన్ పని చేయదన్నది సబబు కాదట.