రౌడీ స్టార్.. దేవరకొండకు నెటిజనుల నుంచి చీవాట్లు కొత్తేమీ కాదు కానీ.. ఈసారి కాస్త వెరైటీగానే తిట్లు తిన్నాడు. ఓ మంచి పని చేయబోయి ఎరక్కపోయి ఇరుక్కున్నాడు. అసలింతకీ ఏం చేశాడు? అంటే.. కరోనా మహమ్మారీ నుంచి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో రేయింబవళ్లు నిద్రాహారాలు మాని హార్డ్ వర్క్ చేస్తున్న పోలీస్ డిపార్ట్ మెంట్ ని రియల్ హీరోస్ అని పొగిడేస్తూ విజయ్ .. సదరు పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొగిడేయడమే అందుకు కారణం.
పోలీసులు రియల్ హీరోలా? కాదా? అన్నది ప్రజలకు తెలుసు. ఇలా ఒక సెలబ్రిటీ వచ్చి దీనిపై ప్రచారం చేయాలా? అంటూ రౌడీని సూటిగానే తిట్టేశారు కొందరు యాంటీ ఫ్యాన్స్. పైగా సైబరాబాద్ పోలీస్ నేరుగా తమ అధికారిక సోషల్ మీడియాలో రౌడీ దేవరకొండతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేయడంతో అది కాస్తా యాంటీ ఫ్యాన్స్ ఫైరింగ్ కి కారణమైంది. వాస్తవానికి పోలీసుల హార్డ్ వర్క్ ఏ రేంజులో ఉందో ప్రస్తుతం నగరంలో సన్నివేశం చూస్తుంటేనే తెలిసిపోతోంది. ఇలా సెలబ్రిటీలు వచ్చి హీరోలు అంటూ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక పోలీస్ డిపార్ట్ మెంట్ తో పాటు ఆరోగ్య శాఖ.. మున్సిపల్ అధికారులు.. వాటర్ డిపార్ట్ మెంట్ వాళ్లు నిరంతరం కంటికి కునుకు లేకుండా బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణం గా రౌడీ నటిస్తున్న ఫైటర్ షెడ్యూల్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. క్రైసిస్ నుంచి బయటపడితే కానీ ఏదీ తేలదు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ నుంచి వెసులుబాటు సినీపరిశ్రమకు ఇస్తారా లేదా? అన్నది చూడాలి.