కరోనా వైరస్ కారణంగా సినీ ఇండస్ట్రీని అల్లల్లాడిస్తోంది. కోట్లల్లో సినిమాలు నిర్మించి టిక్కెట్ ల విషయంలో ప్రేక్షకులకు చుక్కలు చూపించే సినిమా వాళ్లకే కరోనా చుక్కలు చూపిస్తోంది. దీంతో చిన్న సినిమా నుంచి స్టార్‌ల సినిమాల వరకు ఆగిపోయాయి. షూటింగ్స్ కి ఇంకా రెండు మూడు నెలలు పట్టే అవకాశం కనిపిస్తుండటంతో దర్శకనిర్మాతలు ముఖ్యంగా నిర్మాతలు రిస్క్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
కరోనా కోసం విధించిన లాక్‌డౌన్ మే 7తో ముగియబోతోంది. దేశ వ్యాప్తంగా మే 3న ముగుస్తోంది. ఆ తరువాత షూటింగ్‌లకు గానీ, ఇప్పటికే రిలీజ్‌కు సిద్ధమైన సినిమాల ప్రదర్శన కోసం థియేటర్లు తెలిచే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. పరిస్థితులన్నీ చక్కబడి థియేటర్లు తెరవాలంటే మరె రెండు లేదా నాలుగు నెలల సమయం పట్టేలా వుందని నిపుణులు చెబుతున్నారు.
దీంతో అంత కాలం ఎదురుచూడలేని నిర్మాతలు తమ చిత్రాల్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన నిర్మాతలు తమ చిత్రాలని డైరెక్ట్‌గా ఓటీటీ ల్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ లోనూ ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారట. రాఘవ లారెన్స్ నటించిన `కాంచన` చిత్రాన్ని బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రాఘవకు ఇదే తొలి బాలీవుడ్ చిత్రం. మేలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. నిజంగా రాఘవ లారెన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే.