మోదీ సేవలో తరిస్తున్న పవన్ కళ్యాణ్ 

జనసేన అధినేత పవన్‌కు ప్రధాని మోదీ పాలన మీద ఈమధ్య నమ్మకం బాగా పెరిగిపోతోంది.  వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని విధానాలను తెగ పొగిడేస్తున్నారు.  ఈమధ్యే భాజాపాతో పొత్తు కుదుర్చుకుంది జనసేన.  ఆంధ్రా, తెలంగాణల్లో కలిసి పనిచేయాలని తీర్మానాలు కూడా చేసుకున్నారు.  దీంతో గతంలో భాజాపా విధివిధానాలతో పవన్‌కు ఉన్న విభేదాలన్నీ ఉన్నపళంగా గాల్లో కలిసిపోయాయి.  2014 ఎన్నికలప్పుడు టీడీపీ, భాజాపా, జనసేనలు కలిసి పనిచేశాయి.  కానీ ఆ తర్వాత మోదీ ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చడంతో ఇచ్చిన మాట తప్పారంటూ కూటమి నుండి పవన్ బయటికొచ్చేశారు.  
 
హామీలను నెరవేర్చకపోతే మిత్ర పక్షాలను సైతం నిలదీస్తానన్న పవన్ ఆతర్వాత మోదీ ప్యాకేజీ మాట ఎత్తితే దాన్ని పాచిపోయిన లడ్డూలతో పోల్చుతూ నిరసన తెలిపారు.  ఆ ఊపులో ఇక పవన్ భాజాపాను నమ్మడని అంతా అనుకున్నారు.  కానీ కొన్నాళ్లకు కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా భాజాపాతో కలిసి నడవాల్సి వస్తోందని చేతులు కలిపేశారు.  ప్రశ్నించే పరిస్థితే వస్తే మిత్రుల్ని కూడా వదలనన్న మాటల ప్రకారం హోదా విషయంలో మోదీని ప్రశ్నించడం పవన్ ఆపనేకూడదు.  కానీ ఆపేశారు.  
 
ఆపడంతో ఆగకుండా ఇటీవల మోదీ పాలనలో 21వ శతాబ్దం ఇండియాదే అని, మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారని, భాజాపా పాలనలో ఆత్మ నిర్భర భారత్ సాకారమవుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.  మళ్లీ కొత్తగా కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కష్టాల్లో ఇరుక్కున్న మధ్యతరగతి, వేతన జీవులకు కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని, సొంతింటి రుణాలకు రూ.1.50 లక్షల వడ్డీ రాయితీ అదనంగా ఇవ్వడం, లిక్విడిటీ ఫెసిలిటీలో 50 వేల కోట్ల రూపాయల కేటాయించడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ లో కొద్దిమొత్తాలు పెట్టుబడిగా పెట్టిన చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు నష్టపోకుండా ఉంటారని విశ్లేషణ చేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. 
 
కానీ పేదలు, వలస కూలీలకు, రాష్ట్రాలకు ప్యాకేజీలో మిగిలిన మొండిచెయ్యి పవన్‌కు కనబడినట్లు లేదు.  ఒకే దేశం, ఒకే వ్యవసాయ మార్కెట్ విధానంలో రైతులు ఎలా నష్టపోతారు, ప్యాకేజీలో ప్రైవేట్ వ్యక్తులకు గుత్తాధిపత్యం కట్టబెట్టడం వలన భవిష్యత్తులో సంభవించే సమస్యలు జనసేనానికి  కనబడలేదా అంటే అబద్దమే అవుతుంది.  మరి వాటి గురించి పవన్ మాట్లాడటం లేదు.  అందుకు కారణం రాజకీయ ప్రయోజనాలేనని స్పష్టంగా తెలుస్తోంది.  ప్రజా ప్రయోజనాలు తప్ప రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వనని ఆరంభంలో పవన్ మాట్లాడిన సిద్దాంతపు మాటలకు ఈనాడు ఆయన చేస్తున్న రాజకీయానికి బొత్తిగా పొంతన తప్పింది.