ఇరవై ఏళ్ల తరువాత ఎలా వుంటుంది? వందల ఏళ్ల తరువాత ఎలాంటి వాతావరణం వుంటుంది?, ప్రజల జీవన విధానం ఎలా వుంటుంది? వంటి విషయాల్ని ముందే ఆలోచించి తన సినిమాల ద్వారా ప్రపంచానికి చాటిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన రూపొందించిన పుష్పక విమానం, ఆదిత్య 369, విచిత్ర సోదరులు వంటి ప్రయోగాత్మక చిత్రాలే ఇందుకు చక్కటి ఉదాహరణ. గత కొన్నేళ్లుగా డైరెక్షన్‌కి దూరంగా వుంటూ వస్తున్నారు.
సింగీతం శ్రీనివాసరావు వయసు 88 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన ఓ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇటీవల నటీనటులు, క్రీడాకారుల, రాజకీయ నేతల బయోపిక్స్ అత్యధికంగా వస్తున్నాయి. అయితే సింగీతం మాత్రం ఓ గాయని జీవిత కథని తెరపైకి తీసుకురాబోతున్నారట. ఆ గాయని ఎవరు? ఏంటనేది త్వరలోనే వెల్లడి కానుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన రానుందని తెలిసింది.