ఒక బయోపిక్.. అందులో నటించడానికి ఇద్దరు హీరోయిన్‌ల మధ్య పోటీ నడుస్తోంది. బెంగళూరుకు చెందిన దేవదాసిని నాగరత్నమ్మ జీవిత కథ ఆధారంగా దిగ్రేట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఓ బయోపిక్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 88 ఏళ్ల వయసులో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ బయోపిక్‌ని తెరపైకి తీసుకురాబోతుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దేవదాసిగా వున్న నాగరత్నమ్మ ఆ తరువాత కాలంలో గాయనిగా మారి మంచి పేరు తెచ్చుకుంది. జీవిత చరమాంకంలో యోగినిగా మారి మిగతా జీవితాన్ని కొనసాగించింది. ఆమె కథ నేటి తరాలతో పాటు భావితరాలకు స్ఫూర్తి మంతంగా వుంటుందని సింగీతం ఈ కథని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ పాత్ర కోసం అనుష్కని అనుకున్నాడట. ఇప్పటికే ఆమెకు కథని కూడా వినిపించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాత్రలో నటించాలని సమంత కూడా భావిస్తోందట. ఈ విషయం సింగీతం దాకా వెళ్లినట్టు తెలిసింది. ఈ ఇద్దరిలో సింగీతం ఎవరిని ఫైనల్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.