కేరళ ప్రభుత్వం మలయాళ ఇండస్ట్రీకి షాకిచ్చింది. అంతా అనుకున్నట్టే షూటింగ్‌లకు అనుమతి ఇప్పట్లో కుదరదని చెప్పేసింది. ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు షూటింగ్‌లకు అనుమతి అఏదని స్పష్టం చేసింది. దీంతో మిగత రాష్ట్రాల్లో కూడా ఇదే పద్దతిని ప్రభుత్వాలు అమలు చేసే అవకాశం వుందని తెలిసింది. కేరళ నిర్ణయంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే నిర్ణయాన్ని ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వాల ప్రధాన ప్రియారిటీ జనం. వాళ్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అందుకే నిత్యావసరాలుకు మాత్రమే మినహాయింపు నిస్తూ వస్తున్నారు. జనం బాగుంటేనే వినోదం అయినా మరేదైనా.. అదే జనం బాగోకపోతే థియేటర్‌కి వచ్చే వాళ్లే వుండరు కదా ప్రజారోగ్యం ముందు ఆ తరువాతే వినోదం అని చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అదే ఇప్పుడు సినిమా వాళ్లకి శాపంగా మారుతోంది.
థియేటర్లు తెరుచుకునేది, షూటింగ్‌లు మొదలయ్యేది సెప్టెంబర్ తరువాతే కావడంతో చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలని ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా షూటింగ్ అంటే వందల మంది పనిచేయాలి. అలా అంతా ఒక చోట చేరితే అనర్థాలు తలెత్తడం ఖాయం, ఇక థియేటర్‌లదీ ఇదే పరిస్థితి సమాజిక దూరం పాటించి సినిమా హాల్లో సినిమాని ఆస్వాదించడమనేది కుదరని పని. దీంతో ఇండస్ట్రీ వర్గాలు మామూలు పరిస్థితులు ఏర్పడి సినిమా షూటింగ్‌లకు అనుమతులు లభించాలంటే ఐదు నుంచి ఆరు నెలలు పడుతుందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు.
అన్ని ఇండస్ట్రీలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ దీనిపై చర్చ నడుస్తోంది. త్వరోనే ఇండస్ట్రీ నుంచి సంచలనాత్మకమైన నిర్ణయం రాబోతోందని చెబుతున్నారు.