విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `ఫైటర్`. అనన్య పాండే కథానాయిక. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్టు ఇది. ముంబైలో ఇంతకుముందు ఓ షెడ్యూల్ ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారీ వల్ల ఇటీవల చిత్రీకరణ వాయిదా పడింది. మునుముందు ముంబైలో షూటింగులకు ఎంతమాత్రం అనుకూలంగా లేదని సన్నివేశం చెబుతోంది. ఆ క్రమంలోనే తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు.
అయితే ఫైటర్ పాన్ ఇండియా రేంజుకు మారాక అంతా రివర్సు గేర్ లో ఉందట. ప్రస్తుతం పూరి-ఛార్మి బృందం ఏం చేయాలన్నా కరణ్ జోహార్ అనుమతి తప్పనిసరి అవుతోందట. ఎందుకంటే హిందీ వెర్షన్ నిర్మాతగా ఆయన భాగస్వామ్యం ఈ ప్రాజెక్టులో చాలా పెద్దది. పూరికి క్రియేటివిటీ పరంగా స్వేచ్ఛనిచ్చినా కొన్ని విషయాల్లో తన మాటే చెల్లాలని పంతం పడుతున్నాడట. హైదరాబాద్ కి షిఫ్ట్ చేసేందుకు పూరి బతిమాలుకోవాల్సి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా సంగీత దర్శకుడిని మారుస్తున్నారని తెలిసింది. తొలుత ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తారని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్థానంలో బాలీవుడ్ సంగీత దర్శకుడిని ఎంపిక చేయనున్నారట. ఆ మేరకు కరణ్ జోహార్ పూరీపై ఒత్తిడి తెస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మణిశర్మ తో పూరి ర్యాపో గురించి తెలిసిందే. పోకిరి సహా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆ ఇద్దరూ కలిసి పని చేశారు. ఇప్పుడిలా అర్థాంతరంగా అతడిని మార్చడం సరైనదేనా? అన్నది పూరీనే ఆలోచించాలి. అయినా కరణ్ ఎంపిక చేసిన ఆ కొత్త సంగీత దర్శకుడు ఎవరు? అన్నది చూడాలి.