మణిరత్నం మాస్టర్ స్ట్రోక్! ‘నవాబ్’ (మూవీ రివ్యూ)

(సికిందర్)


దర్శకత్వం : మణిరత్నం 
తారాగణం : అర
వింద స్వామిఅరుణ్ విజయ్శింబుప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, జయసుధ, జ్యోతికఅదితీ రావ్ హైదరీ, ఐశ్వర్యా  రాజేశ్త్యాగరాజన్ దితరులు
రచన : మణిరత్నం – , సంగీతం
: .ఆర్‌.రెహమాన్, ఛాయాగ్రహణం : సంతోష్ శివన్, 
బ్యానర్ : 
 లైకా ప్రొడక్షన్స్
నిర్మాత
లు: ణిరత్నంల్లనేని అశోక్
విడుదల : సెప్టెంబర్ 27, 2018

 రేటింగ్  3.5 / 5

చూసి చూసి మణిరత్నం ఓ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి వదిలారు. గత మూడున్నర దశాబ్దాలుగా తమిళ, తెలుగు, హిందీ భాషాల్లో ప్రేమ సినిమాలతో సమానంగా యాక్షన్ సినిమాలతో తన కళాత్మకతనంతా  ప్రదర్శించుకుంటూ వస్తున్న మణిరత్నం గత మూడు ప్రేమ సినిమాలతో యువప్రేక్షకులని అందుకోలేక చతికిలబడ్డారు. ఐపోయింది ఆయన పని అనుకున్నారు అభిమానులంతా. అయిపోలేదని ఆయన యాక్షన్ సినిమా పట్టుకుని ఆశ్చర్యపోయేలా జవాబు చెప్పారు. తీసింది కొరియన్ మూవీని కాపీ కొట్టే కావొచ్చు (ఆయన ఇలాటి పని చేస్తారని ఎవరూ వూహించకపోవచ్చు), కానీ ‘న్యూ వరల్డ్’ ని ఈ కాపీ చేసిన విధానమే ఒక ఎడ్యుకేషన్ అయికూర్చుంది. కాపీ చేయడాన్ని తన సొంత శైలిలోకి, సొంత విజన్ లోకి, సొంత క్రాఫ్ట్ లోకీ  మార్చేసి ఇది మణిరత్నం మార్కు ఒరిజినల్ సృష్టేకదా అన్పించేట్టు చేశారు. కొరియన్ మాఫియా డ్రామాని  అచ్చమైన దేశవాళీ నేటివిటీలోకి మార్చేసి, సజీవ సహజ పాత్రల్ని కల్పించి, కూర్చున్న ప్రేక్షకుణ్ణి కదలకుండా కూర్చోబెట్టేశారు చివరంటా.

          దీన్ని తమిళంలోంచి తెలుగుకి రీమేక్ చేయలేదు, అలాగే దీన్ని తమిళ – తెలుగు ద్విభాషా చలన చిత్రంగానూ తీయలేదు. కాబట్టి దీంట్లో తెలుగు నేటివిటీని వెతకడం అజ్ఞానమవుతుంది. తమిళ నేటివిటీకి చెన్నైలో మాఫియా కథ అంటే సరిపోతుంది, తెలుగుకి హైదరాబాద్ లో మాఫియా కథ అంటే వాస్తవికత కోల్పోతుంది. ఫ్యాక్షన్ కథ వుండొచ్చు. కాబట్టి దీన్ని తెలుగు నేటివిటీతో కాకుండా, తమిళ నేటివిటీలో చక్కగా కుదిరే చెన్నై మాఫియా ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా చూస్తే,  భూపతి (ప్రకాష్ రాజ్) చెన్నైలో పెద్ద మాఫియా డాన్. అతడి కుటుంబంలో భార్య లక్ష్మి (జయసుధ), కొడుకులు వరద (అరవింద్ స్వామి), త్యాగు (అరుణ్ విజ‌య్‌), రుద్ర (శింబు), పెద్ద కోడలు చిత్ర (జ్యోతిక), ఆమె పిల్లలిద్దరు, బావమరిది మోహన్ (చీను మోహన్) వుంటారు. 

          పెద్దకొడుకు వరద తండ్రి తోనే వుంటూ మాఫియా కార్యకలాపాలు చూస్తూంటాడు. ఇతను వివాదాల్లో చర్చలు జరపడు, కాల్పులు జరిపే ఆవేశంతో వుంటాడు. పార్వతి (అదితీ రావ్ హైదరీ) తో రెండో కాపురం పెడతాడు. భార్య చిత్ర ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. సత్యమొక్కటే విముక్తి కల్గిస్తుందని నమ్ముతుంది. 

          చిన్న కొడుకులు త్యాగు, రుద్రలు విదేశాల్లో సొంత బిజినెస్ లు ఏర్పాటు చేసుకుంటారు. త్యాగు దుబాయ్ లో సంపన్న షేకుల్ని బురిడీ కొట్టించి భారీ కాంట్రాక్టులు సంపాదిస్తూంటాడు. ఇతడికి అక్కడే భార్య రేణు (ఐశ్వర్యా రాజేష్), ఇద్దరు పిల్లలూ వుంటారు. ఇక రుద్ర సెర్బియాలో అక్రమాయుధాలూ, మాదక ద్రవ్యాలూ స్మగ్లింగ్ చేసే దందాలో వుంటాడు. ఇతడికి ఛాయ (డయానా ఎరప్ప) అనే గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. 

          ఇలా వుండగా చెన్నైలో భూపతి – అతడి భార్య లక్ష్మి మాఫియా దాడిలో తీవ్రంగా గాయపడతారు. దీంతో విదేశాల నుంచి త్యాగు, రుద్రలు వచ్చేస్తారు. రైవల్ మాఫియా చిన్నప్ప (త్యాగరాజన్) ఈ దాడి జరిపించాడని పెద్దకొడుకు వరద అతడికి మీదికిపోతాడు. చిన్నప్ప అతడి వాదనని తిప్పికొడతాడు. ఇంతలో రసూల్ (విజయ్ సేతుపతి) అనే పోలీస్ ఇన్స్ పెక్టర్ ఒక కేసులో సస్పెండ్ అవుతాడు. ఇతను వరద బాల్యమిత్రుడు. వచ్చి సస్పెన్షన్ విషయంలో వరద సాయం కోరతాడు. వరద తన తల్లిదండ్రుల మీద దాడి  జరిపిందెవరో తెలుసుకుని చెప్పాలన్న షరతు పెడతాడు. రసూల్ ఇందుకు అంగీకరిస్తాడు. తండ్రి గాయాలనుంచి కోలుకున్నాక త్యాగు, రుద్రలు తిరిగి విదేశాలకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక తండ్రి మరణిస్తాడు. అంత్యక్రియలకి చిన్నకొడుకులు రారు. రాకపోగా మాఫియా వారసత్వం కోసం పోటీ పడతారు. ముగ్గురు అన్నదమ్ముల మధ్య వారసత్వ పోరు మొదలవుతుంది.ఈ వారసత్వ పోరు హింసాత్మకంగా మారి, పరస్పరం  వాళ్ళ ఉనికికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది…

          మణిరత్నం ఎక్కడా కథ పట్టు తప్పకుండా అత్యంత పకడ్బందీగా నడిపిస్తాడు. తొలి సగం తల్లిదండ్రుల మీద దాడి జరిపిందెవరనే ప్రశ్నతో, మలిసగం ఇక మాఫియా వారసు లెవరవుతారనే సమస్యతో కథని రెండుగా విభజించి, ఎక్కడా పక్కదోవ పట్టకుండా ఏకత్రాటిపై అత్యంత ప్రతిభావంతంగా నడిపిస్తాడు. బలమైన పాత్రచిత్రణలతో అంతుచిక్కని  సస్పెన్స్ ని పోషిస్తాడు. మలిసగంలో ఒకటొకటే పాత్రల రహస్యాలు బయట పెడుతూ,  చివరికి తీసికెళ్ళి గట్టి బ్యాంగ్ ఇస్తూ బ్లాస్ట్ చేస్తాడు. ఆధిపత్య పోరులో ఎవరిది పై చేయి అవుతుందన్న ప్రశ్న పెద్ద పజిల్ గా వెంటాడుతుంది ప్రేక్షకుల్ని. అది వూహించలేని ట్విస్టుకి దారి తీస్తుంది. ఈ ట్విస్టుకి ఇంకో అనూహ్యమైన ఫినిషింగ్ టచ్ తో డబుల్ ధమాకా ఇచ్చి ముగిస్తాడు.

          మణిరత్నం మళ్ళీ మళ్ళీ తన అలవాటయిన పంచభూతాల్ని వాడుకోవడం కూడా చేస్తాడు. నీరు, నిప్పు, గాలి, నేల, ఆకాశం ఎక్కడెక్కడ ఏ సన్నివేశానికి ఎలా వాడుకుని భావోద్వేగాలు రగిలించాలో దిగ్విజయంగా చేస్తాడు. కళాత్మకంగా దృశ్యీకరిస్తాడు. తమిళ టైటిల్ వచ్చేసి, ‘చెక్కా చివంతా వానం’ అని. అంటే, ఆకాశం ఎర్రటి ఎరుపెక్కిందని. ఈ టైటిల్ అర్ధంగావాలంటే అద్భుతమైన క్లయిమాక్స్ దృశ్యాలు చూడాల్సిందే. తెలుగులో పెట్టిన ‘నవాబ్’  టైటిల్ కూడా ముగిపులోనే అర్ధమవుతుంది. ప్రతీదీ సస్పెన్సే మణిరత్నం చేతిలో.  

          ఒక్కో షాట్ కంపోజిషన్ ఒక అర్ధంతో కథలోంచి, పాత్రల్లోంచీ వచ్చేవే. మేకింగ్ ఆద్యంతం ఔత్సాహికులకి స్టడీ మెటీరియలే. ప్రతీ సీనియర్ దర్శకుల నుంచి నేర్చుకోవాలని కొత్త దర్శకులు వుంటారు. దురదృష్ట వశాత్తూ ఇప్పుడు సీనియర్ దర్శకులు చాలా మందికి ఈ స్పృహ వుండడం లేదు. దీంతో కొత్త దర్శకులకి నేర్చుకోవడానికి లేక విదేశీ సినిమాల మీద ఆధారపడతారు. మణిరత్నం ఇలా కాదు. కథా కథనాల కాడ్నించీ, పాత్ర చిత్రణల్లో, సన్నివేశ కల్పనల్లో, సంభాషణల్లో, నటనల్లో, కెమెరా పనితనంలో, సంగీతంలో, ఎడిటింగ్ లో, యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీలో, లొకేషన్స్ ఎంపికలో, అన్నిటా అడుగడుగునా తన అనుభవంతో పాఠాలే నేర్పే స్తాడు.

 

          సంతోష్ శివన్ కెమెరావర్క్ ఈ మాఫియా కథా లోకాన్ని కళ్ళు తిప్పుకోనివ్వని కొత్తదనంతో, తాజాదనంతో ఆవిష్కరిస్తుంది. అతను వాడిన లైటింగ్స్, కలర్స్ అత్యున్నత ప్రమాణాల దృశ్యవైభవాన్ని సృష్టిస్తాయి. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతంలోని రెండు బ్యాక్ గ్రౌండ్ పాటలు వుండీ లేనట్టు మంద్రంగా సాగుతాయి. పూర్తి నిడివి నేపధ్య సంగీతమైతే థీమ్ ని పలికిస్తుంది.

          నటీనటులందరూ ఒక్క మాటలో ఎక్సెలెంట్. మణిరత్నం తనని తాను ఉన్నత శిఖరం మీద ప్రతిష్టించుకుని, తనలోని ఉత్తమాభిరుచుల్ని ప్రసరింపజేస్తూ ఈ హైవోల్టేజి వయోలెంట్ యాక్షన్ మూవీకి వూపిరులూదాడు. ఇప్పుడు కూడా తనేం తీసిపోలేదని ఇతరులకి దీటుగా కళాసృష్టి చేశాడు.