వైఎస్ షర్మిలపై దాడి.? ఎందుకు చేశారు.? ఎవరు చేశారు.!

తెలంగాణలో రాజకీయాలు నానాటికీ కక్ష సాధింపు చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాయ్. దాడులు, ప్రతిదాడులతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దరిమిలా, అన్ని రాజకీయ పార్టీలూ అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్న విషయం విదిమే.

ప్రస్తుతానికైతే తెలంగాణలో రెండు పాదయాత్రలు నడుస్తున్నాయి. ఒకటి వైఎస్ షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర కాగా, ఇంకొకటి బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విడతల వారీగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ఐదో విడత పాదయాత్ర.

బండి సంజయ్ పాదయాత్రపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ భంగపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని పాదయాత్రకు శ్రీకారం చుట్టారు బండి సంజయ్. మరోపక్క, వైఎస్ షర్మిల పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగుతోంది. త్వరలో ఆమె 3,800 కిలోమీటర్ల మైలు రాయిని అందుకోబోతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఆమె పాదయాత్ర ముగిసే అవకాశం వుంది. ప్రస్తుతం నర్సంపేటలో పాదయాత్ర జరుగుతుండగా, ఈ పాదయాత్రపై గులాబీ శ్రేణులు దాడి చేశాయి.

వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీలు ఝులిపించారు. టీఆర్ఎస్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణుల మధ్య గలాటా చోటు చేసుకుంది. పోలీసులు భద్రతా కారణాల రీత్యా వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు చిన్నపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల మొహంపై రెండు చోట్ల గాయాలయ్యాయి. దానికి సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ దాడి ఎవరు చేశారన్నదానిపై పెద్ద రచ్చ జరుగుతోందిప్పుడు.