తెలంగాణ మహాకూటమి చంద్రబాబుకు లాభమా నష్టమా?

(వి. శంకరయ్య)

తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అధికారంలోకిని రావాలని ఎపిలో టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు బలంగా కోరుతున్నారు. కాని మహాకూటమి అధికారంలోని కొచ్చినా కెసిఆర్ విజయం సాధించినా ఇందులో ఏది సంభవించినా వాస్తవంలో ఎపిలో టిడిపి కి ఏమాత్రం మేలు చేకూరే అవకాశాలు వుండవు.

తెలంగాణలో మహాకూటమి అధికారంలోనికి వస్తే చంద్రబాబు కు వ్యక్తిగతంగా రక్షణ చేకూర వచ్చు. తెలంగాణలో వున్న చంద్రబాబు నాయుడు ఆస్తులకు కంపెనీలోని పెట్టుబడులకు దెబ్బ తగల కుండా ఛత్రం ఏర్పడ వచ్చు. కాని ఎపి లోనీ ప్రజలను ప్రభావితం చేసిపరోక్షంగా నైనా టిడిపి కి మేలు చేకూరే అవకాశాలు వుండవు.

ఎపి తెలంగాణ రాష్ట్రాలు రెండు సరి పోల్చి పరిశీలించితే ప్రజలకు ఎపి కన్నా తెలంగాణలో ఎంతో కొంత మంచి జరిగింది. అవినీతి ఎపి లో ఎక్కువ. పైగా నిధుల వినియోగమూ ఎపి కన్నా తెలంగాణ లో ఎక్కువగా జరిగింది. ఎపి కన్నా తెలంగాణ కు రాబడులు అధికం. మిగులు రాష్ట్రం కూడా. రైతులకు విద్యుత్ సరఫరాలో తెలంగాణ ముందు వుంది. రైతు బంధు పధకం రైతులకు ఉపయోగ కరమైనదే. అయితే పెద్ద గా కెసిఆర్ సాధించాడని చెప్ప లేముగాని ఎపితో పోల్చితే ఈ నాలుగు ఏళ్లలో ఎపి కన్నా తెలంగాణ ప్రభుత్వం కొంత మెరుగ్గా పని చేసింది.ఈ అంశాన్ని చంద్రబాబు అనుంగు మిత్ర పాత్రికేయుడు పలుమార్లు తన పలుకులలోవెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఒక వేళ కెసిఆర్ ఎన్నికల్లో ఓడిపోతే ప్రభుత్వ వ్యతిరేకత అనే వైరస్ బలంగా పని చేసిందని భావించాలి. రేపు ఈ వైరస్ ఎపిలో తన విశ్వ రూపం చూప వచ్చు. . ఈ వైరస్ ఏదో ఒక రాష్ట్రానికే పరిమితం కాదు. గతంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంలో ఈ అనుభవం మనకుంది అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత ఒకే విధంగా పనిచేసింది.. ఈ వైరస్ పని చేసి కెసిఆర్ ఓడిపోతే ఎపిలో కూడా విధిగా టిడిపి ఓటమి పాలు కాక తప్పదు. పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు – ప్రభుత్వ వ్యతిరేకత అనే వైరస్ బారి నుండి తప్పించు కోలేరు.
. తెలంగాణ లో తన పార్టీ భాగస్వామ్యం గల కూటమి గెలుపు ఎపికి ఊతం ఇస్తుందని భావించితే పప్పులో కాలేసినటే. అయితే జాతీయ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఊతం లభించ వచ్చు. గాని ఎపి ప్రజలపై పెద్ద గా ప్రభావం చూపదు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల ప్రజలు తమ జీవితంలో వచ్చిన అభివృద్ధి కొల మానంగా తీసుకుంటారు. . గాని పక్క రాష్ట్రంలో అదీ అధికారం లోనికి రాకుండా నాలుగు సీట్లు గెలిస్తే భ్రమించి గెలిపించు తారని భావించడం భ్రమ మాత్రమే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గోరంత కొండంతగా ప్రచారం చేసుకొనే అవకాశం వున్నందున ఫలితంగా అతి స్వల్ప లాభం చేకూర వచ్చు. అంతేకాదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక పని చేసిందంటే అంతటితో ఎపిలో టిడిపి కి మంగళం పాడక తప్పదు.కాగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో అది ఓడి పోయి నంత మాత్రాన చంద్రబాబు రోజు మోడిని తిట్టి పోసితే ప్రజలు చంద్రబాబును గెలిపించుతారనేందుకు ప్రాతి పదిక లేదు.

పైగా మరో అంశముంది. ప్రతిపక్షాల ఓట్లు చీలి పోకుండా వున్నందున కూటమి గెలుపు సాధ్యం కావచ్చు. కానీ రేపు ఎపి పరిస్థితి భిన్నంగా వుండ బోతోంది. 2014 లో చంద్రబాబు కు ఎంతో కొంత మేర సహకరించిన బిజెపి పవన్ కళ్యాణ్ వేరు కుంపట్లు పెట్టారు. టిడిపి కి పడిన ఓట్లు చీలి పోతాయి. పైగా ప్రభుత్వ వ్యతిరేక పెనుభూతం లాగా పొంచి వుంది. టిడిపి ఒక్కటే పోటీ చేసినా గెలుపొందు తామనే ధైర్యం చంద్రబాబు కు వుండి వుంటే ఆ గర్భ శత్రువు అయిన కాంగ్రెస్ తో జట్టు కట్టేవారు కాదు. కాంగ్రెస్ తో జట్టు కట్టడంతోనే పరోక్షంగా చంద్రబాబు ఓటమి అంగీకరించారు. మార్జినల్ ఓట్లు కోసమే చంద్రబాబు ఇంత దిగజారారు. ఈ పూర్వ రంగంలో తెలంగాణలో కెసిఆర్ ఓటమి ఎపిలే టిడిపి గెలుపు కు ఏ మాత్రం మేలు చేయక పోగా ఎదురు దెబ్బకు దారి తీస్తుంది

ఒకవేళ తెలంగాణలో కెసిఆర్ విజయం సాధించితే చంద్రబాబు కు గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు రెండు తప్పవు. అంతే కాకుండా బిజెపియేతర కూటమికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు గండి పడుతుంది. చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమయం వెచ్చించుతుంటే కెసిఆర్ చెలరేగి పోయి అన్ని రాష్ట్రాలు తిరిగే అవకాశముంది.
ఇది కాకుండా తెలంగాణ విజయం ప్రభావం కన్నా తెలంగాణలో ఓటమి చెందితే దాని ప్రభావం ఎపిలో చాలా తీవ్రంగా పనిచేస్తుంది.
రాష్ట్రంలో ప్రతి పక్షాల గురించి చంద్రబాబు చేస్తున్న ప్రచారం పక్కన బెడితే పవన్ జగన్ ఏమాత్రం కలిసే అవకాశాలు లేవు. పైగా వీరిరువురు బిజెపి తో అంతకన్నా కలవరు.

అయితే ఎపిలో ఎవరికి వారు పోటీ చేసినందున ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టిడిపికి మంచి జరిగే అవకాశం వుందని భావించలేం. 2014 లో టిడిపి కి పడిన ఓట్లు ఎక్కువ భాగం ఈ సారి పవన్ చీల్చవచ్చు.  వైసిపి కి పట్టు వున్న రాయలసీమ జోలికి పవన్ కళ్యాణ్ ఇంతవరకు వెళ్ల లేదు. టిడిపికి ఎక్కువ స్థానాలు వచ్చిన ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలపై కేంద్రీకృతం చేస్తున్నందున పవన్ కళ్యాణ్ టిడిపి ఓట్లుకు భారీగా గండి పెట్టవచ్చని అనుకోవచ్చు.ఈ ప్రమాదం అతి పెద్దది.

అందువలన త్రిముఖ పోటీలు లేక బహుముఖ పోటీలు జరిగినా అంతిమంగా చంద్రబాబు నాయుడు నష్ట పోవలసి వుంటుంది. తెలంగాణ గెలుపు చూపెట్టి ఎపిలో టిడిపి లబ్ది పొందే అవకాశాలు వుండవు. ఒక వేళ కెసిఆర్ గెలుపొందితే ఎపి లో టిడిపి నీరస పడటం అటుంచి చంద్రబాబు ఆస్తులు పెట్టుబడులపై కెసిఆర్ కొరడా తిప్పక మానడు. ఆ మాట కోస్తే చంద్రబాబు పెట్టుబడులు ఆస్తులు అన్నీ తెలంగాణ లోనే వున్నాయి

అంత కన్నా మరో షాక్ టిడిపి అనుభవించక తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం కెసిఆర్ ఈ ప్రమాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2014 తర్వాత ముందుగా కెసిఆర్ పార్టీ ఫిరాయింపులకు తెర దీశారు. జంట నగరాల కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పార్టీ ఫిరాయింపులను రాజకీయ వ్యభిచారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. కాని తుదకు కెసిఆర్ కన్నా ఎక్కువగా పార్టీ ఫిరాయింపులను అమలు చేశారు. నేడు టిడిపి పుష్పక విమానంగా వుంది. చంద్రబాబు కన్నా తక్కువగా ఇతర పార్టీల వారిని చేర్చు కొన్న కెసిఆర్ ఎన్నికలు వచ్చే సరికి అందరికీ సర్దుబాటు చేయలేక పోయే సరికి పలువురు గోడ దూకారు. ఇంకా ఇది కొన సాగుతోంది. ఒకవేళ కెసిఆర్ పరాజయం పాలైతే పార్టీ ఫిరాయింపులు ఒక ప్రధాన కారణంగా వుండ బోతోంది.

కెసిఆర్ తల దన్నే విధంగా పార్టీ ఫిరాయింపులకు తెర దీసిన చంద్రబాబు ప్రస్తుతం తెలంగాణ అనుభవం దృష్ట్యా ఎన్నికలు సమీపించే సమయానికి కెసిఆర్ కన్నా ఎక్కువగా తల పోటు భరించక తప్పదు.

ఇప్పటికే చాల మంది బెర్త్ ల కోసం వెతుక్కుంటూ వున్నారు. కనీసం ఎంత తక్కువగా అంచనా వేసినా 50 నియోజకవర్గాలో ఈ బెడద వుంది. పైగా పులి మీద పుట్ర లాగా కాంగ్రెస్ తో జట్టు కట్టడం వలన వారికి కనీసం పాతిక స్థానాలు ఇవ్వాలి.
నా సామి రంగా అప్పుడు వుండ బోతోంది చంద్రబాబు కు నిద్ర లేని రాత్రులు. ఈ పరిణామాలను తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చూడ వలసి వుంది. 

(రచయిత శంకరయ్య  రాయలసీమ రాజకీయ వ్యాఖ్యాత)