రసమయి బాలకిషన్ పై ఎస్పీకి మహిళ ఫిర్యాదు

మానకొండూర్ తాజా మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ధి రసమయి బాలకిషన్ పై జ్యోతి అనే  మహిళ  రాజన్న సిరిసిల్ల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ లో నవంబర్ 4 వ తేదిన రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పలువురు మహిళలు రసమయి బాలకిషన్ ను సమస్యల పై ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన రసమయి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కొంత మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని వారు ఫిర్యాదు చేశారు. అసలు విషయమేంటంటే…

నవంబర్ 4 న కందికట్కూర్ లో రసమయి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.  గ్రామానికి చెందిన కొందరు మహిళలు సమస్యలపై నిలదీయడంతో పాటు 2014 న వచ్చి మళ్లీ ఇప్పుడు వస్తున్నావా అంటూ ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన రసమయి మహిళల మనోభావాలను కించ పరిచే విధంగా మాట్లాడారని, అంతే కాకుండా కొందరి మహిళల భుజాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని కందికట్కూర్ గ్రామానికి చెందిన  జ్యోతి ఫిర్యాదులో పేర్కొంది.

ఎన్నికల నియమావళికి విరుద్దంగా ప్రవర్తించిన రసమయి పై చర్య తీసుకోవాలని ఆమె ఎస్పీ రాహుల్ హెగ్డెకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ లు, ఫోటోలను ఆమె జత చేశారు. జ్యోతితో పాటు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఉన్నారు.  

రసమయి ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి చాలా గ్రామాలలో ప్రజలు అడ్డుకొని నిరసన తెలిపారు. మరికొన్ని గ్రామాలలో రసమయి పై తిరుగుబాటు చేయడంతో రసమయి తప్పించుకొని బయటపడ్డారు. రసమయి ఎమ్మెల్యేగా తమకు ఏం చేయలేదని వారు విమర్శించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని రసమయి వస్తున్నాడో చెప్పాలని చాలా ప్రాంతాలలో ప్రజలు తిరగబడ్డారు. దీంతో చాలా ప్రాంతాలలో రసమయి విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.