వరంగల్ నగరంలో తెల్లారుగట్ల కోడి కూత కూసే సమయానికి అటూ ఇటూగా.. ఆడవాళ్లంతా ఒక షాపింగ్ మాల్ దగ్గరకు ఒక్కరొక్కరుగా చేరుకుంటరు. తెల్లారే సరికి అక్కడ ఆడవాళ్ల హడావిడి బాగానే ఉంటది. ఇగ పొద్దున తొమ్మిది, పది అయిందంటే చాలు ఆ షాపింగ్ మాల్ ముంగట బిగ్ క్యూ కనబడ్తది. అప్పటికే పోలీసులు కూడా వచ్చి ఆ లైన్ ను పర్యవేక్షిస్తుంటారు. ఆడ పోలీసులు, మగ పోలీసులు ఇద్దరూ అక్కడికి వచ్చి డ్యూటీ చేస్తరు. మిట్ట మధ్యాహ్నం 12 గొట్టంగ ఆ లైన్ బంద్ అయింతది. ఈ మధ్యలో వందలాది మంది అక్కడికి వచ్చి లైన్ కట్టి తమ వంతు వచ్చే వరకు ఉండి తర్వాత వెళ్లిపోతారు. వీరు ఎందుకొస్తారు? ఏం చేస్తారో తెలుసా? తెలుసుకునేందుకు స్టోరీ చదివి వీడియో కింద ఉంది చూడండి.
వరంగల్ నగరంలో కళ్యాణ లక్ష్మి అనే ఒక షాపింగ్ మాల్ ఉంది. ఈ షాపు యజమాని ఇటీవల నగర ప్రజలకే కాకుండా వరంగల్ చుట్టుముట్టు గ్రామాల ఆడవాళ్లకు కూడా ఒక ఆఫర్ అనౌన్స్ చేసిండు. అదేంటిదంటే పది రూపాయలకే చీరె. ఇంత అగ్గువకే చీర ఎట్ల ఇస్తున్నడని ఆడవాళ్లంతా పరేషాన్ అయ్యారు. నిజంగ చీరెలేనా ఉత్తగనా అని కొందరు డౌట్ పడ్డరు. ఎందుకైనా మంచిది పొయ్యి ఒకటి కొనుక్కుంటే ఎట్లుంటదని ఆ షాపు ముంగటికి పోయిర్రు. లైన్ కట్టిర్రు చీరె కొనుక్కున్నరు. చీరె ఖరీదు పది రూపాయలే అయినా బాగానే ఉందని కొన్నవాళ్లు చెబుతున్నారు. ఎంత బాగా ఉందని అడిగితే పోయిన బతుకమ్మకు తెలంగాణ సర్కారు ఇచ్చిన చీరె కంటే బాగానే ఉందంటున్నారు.
ఈ సోమవారం నుంచి ఇప్పటి వరకు ఐదురోజులుగా కళ్యాణ లక్ష్మి షాపింగ్ వారు పదిరూపాయలకే చీరెలు అందిస్తున్నారు. అయితే ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ చీరెలు అమ్ముతున్నారు. షాపింగ్ మాల్ మందు పెద్ద క్యూ కట్టి జనాలు చీరెలు కొనుగోలు చేస్తున్నారు. షాపింగ్ మాల్ లో కాకుండా షాప్ ముందే కౌంటర్ ఏర్పాటు చేసి పదిరూపాయలు తీసుకుని కాటన్ చీరె ఇచ్చి పంపుతున్నారు. స్టాక్ ఉన్నంత వరకే ఈ చీరెల పంపిణీ ఉంటదని షాప్ యజమాని ప్రకటించారు. కానీ ఆరు రోజులుగా పది రూపాయల చీరెల అమ్మకం చేపడుతూనే ఉన్నారు. మరి ఇంకెన్నిరోజులు ఇస్తారో చూడాలి. రోజుకు ఐదారు వందల చీరెలు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. చీరెలు మాత్రం బాగున్నాయని కొనుక్కున్నవారు అంటున్నారు.
ఈ వార్త నగరంలో పాకడంతో గత ఆరు రోజులుగా కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ ముందు పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి లైన్ కట్టి చీరెలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒక మహిళకు ఒక చీరె మాత్రమే ఇస్తున్నారు. మధ్యాహ్నం 12 కాగానే దుకాణం బంద్ చేస్తున్నారు. అప్పట వరకు లైన్ లో ఉన్నవారంతా వెనుదిరిగి పోతున్నారు. మరికొందరు మరుసటిరోజు మరింత తొందరగా వచ్చి లైన్ కట్టి చీరెలు కొనుక్కుని వెళ్తున్నారు. మొత్తానికి వరంగల్ నగరంలో ఈ పది రూపాయల చీరె అమ్మకం హాట్ టాపిక్ అయింది.