Janwada Farm House: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై రాజకీయ పోరాటం లేదా గందరగోళం తారాస్తాయికి చేరింది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అటు.. ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీగా ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్‌ఎస్ భగ్గుమంది. ఇంతకీ.. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగింది ఫ్యామిలీ పార్టీనా?.. రేవ్ పార్టీనా?.. అసలు.. మొత్తం ఎపిసోడ్‌పై పోలీసు ఎంక్వైరీలో ఏం తేలబోతోందన్న చర్చ సాగుతోంది. గతకొంతకాలంగా సైలెంట్‌గగా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఇప్పటికే.. గత రెండు, మూడు రోజులుగా దీపావళి పండుగ వేళ పొలిటికల్ బాంబులు పేలతాయన్న మంత్రి పొంగులేటి కామెంట్స్ కాక రేపుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ బాంబులు టార్గెట్‌గా మాటలయుద్దాలు నడుస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సడెన్‌గా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. దాంతో.. బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడ్డారు.
డ్రగ్స్ కల్చర్‌కు వ్యతిరేకమని చెప్పిన బీఆర్‌ఎస్ నేతలు.. ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారంపై సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్లాన్ ప్రకారం ఫామ్ హౌస్ పార్టీని కాంగ్రెస్ నేతలు వివాదాస్పదంగా మార్చారని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు.ఇక.. ఫామ్ హౌస్ పార్టీ అంశంలో రాజకీయాలకు అతీతంగా చట్టప్రకారం వ్యవహరించాలని కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి అన్నారు.
ప్రభుత్వ పాలనతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలు దిగడం కాదని నిజాన్ని నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు.జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో సీరియస్‌గా ఎంక్వైరీ జరగాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఫామ్ హౌస్‌లో ఏం జరిగిందో తేలాలంటే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. ఫామ్ హౌస్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల తీరును బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండిరచారు.
కొత్తగా ఇళ్లు కట్టుకుని ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్తోన్న పొలిటికల్ బాంబులు ఇవేనా?.. అని ప్రశ్నించారు. మొత్తంగా.. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రేవ్ పార్టీ అని కాంగ్రెస్.. కాదు.. ఫ్యామిలీ పార్టీ అంటూ బీఆర్‌ఎస్.. మధ్యలో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. అసలు.. ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసులు ఏం తేలుస్తారో చూడాలి. మొత్తంగా దీపావళి ముందు పటాకులు పేలుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి.