వరంగల్ కాంగ్రెస్ కు టిఆర్ఎస్ గట్టి షాక్

ప్రగతి నివేదన సభకు అధికార టిఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నది. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రగతి నివేదన సభ ఉంటుందని టిఆర్ఎస్ చెబుతున్నది. జన సమీకరణపై సీరియస్ గా దృష్టి సారించింది. మరోవైపు ప్రగతి నివేదన సభ ఆపాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రగతి నివేదన సభ వద్ద టిఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. వరంగల్ నగరానికి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ కు మిఠాయి తినిపిస్తున్న ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్

వచ్చే ఎన్నికల్లో 75 సీట్లతో అధికారం చేజిక్కించుకుంటామని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బల్లగుద్ది మరీ చెబుతున్నది. తాము చేయించిన సర్వేలు అలా చెబుతున్నాయని పిసిసి ప్రసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఈ మాటల్లో వాస్తవం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనూ రోజుకో నాయకుడు కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ గూటికి చేరిపోతున్నారు. బంగారు తెలంగాణ కోసమే వారు చేరుతున్నట్లు చెబుతున్నారు.

తాజాగా వరంగల్ నగరానికి చెందిన 39వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరిపోయారు. వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న నలుగురు కార్పొరేటర్లలో వేముల శ్రీనివాస్ ఒకరు. శుక్రవారం ఆయన మంతర్ కేటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు హైదరాబాద్ కు తరలి వచ్చారు. ఆ సమయంలో మంత్రి కేటిఆర్ కొంగర కలాన్ లోని ప్రగతి నివేదన సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో ఔటర్ మీదుగానే బండ్లు తిప్పి వేముల శ్రీనివాస్ ప్రగతి నివేదన సభా ప్రాంగణం వద్దకు వెళ్లి కేటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు కేటిఆర్.

వరంగల్ నగర 39వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేటిఆర్

వరంగల్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని షాక్ గా చెబుతున్నారు. ఉన్న నలుగురు కార్పొరేటర్లలో ఒకరు జంప్ కావడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు. వరంగల్ అర్బన్ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి వైఫల్యం కారణంగానే నగర కార్పొరేటర్ టిఆర్ఎస్ పార్టీలో చేరాడని వరంగల్ నగరానికి చెందిన ఒక నేత ‘తెలుగురాజ్యం’కు చెప్పారు. అందరినీ కలుపుకుని పోవాల్సిన సమయంలో నాయిని రాజేందర్ రెడ్డి వైఫల్యం ఉందన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు తమ పార్టీ కేడర్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ గ్రూపు తగాదాలతో వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

వరంగల్ కార్పొరేటర్ టిఆర్ఎస్ పార్టీకిలోకి జంప్ చేసిన విషయం పిసిసి పెద్దల నోటీసుకు వచ్చిందని చెబుతున్నారు. దీనిపై సమీక్ష జరిపే అవకాశముందని అంటున్నారు. చూస్తూ చూస్తూ ఎన్నికలు మూతి ముందర ఉన్న వేళ ఇలా జంపింగ్ చేస్తుండడం కాంగ్రెస్ పెద్దలను కలవరపెడుతున్నట్లు చెబుతున్నారు.

వరంగల్ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి

మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ జరగకముందే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చిందని రాజకీయవర్గాల్లో టాక్ వినబడుతోంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఎన్నికల నాటికి మరింత ప్రమాదం తప్పదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.