రాసలీలల మంత్రి ఓట్…వినయ విధేయుడు ఇన్… తెలంగాణ క్యాబినెట్ లో మార్పులు

రాజకీయాల్లో కులం పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. కారణంగా మంచైనా, చెడైనా కులాల లెక్కలు తప్పొద్దు. సరిగ్గా ఈసారి కూడా తెలంగాణలో ఇదే నిజం అవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాసలీలల ఆరోపరణలపై కరీంనగర్ జిల్లాకు చెందిన  ఓ మంత్రికి తదుపరి క్యాబినెట్ విస్తరణలో పదవీ గండం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆయన సామాజికవర్గానికే చెందిన నేతతోనే.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారని సమాచారం. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేరు తెర పైకి వచ్చింది.

కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు  వరంగల్ జిల్లాకు చెందిన వినయ్ భాస్కర్‌కు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. వినయ్ భాస్కర్‌కు కిందటి మంత్రివర్గ విస్తరణలోనే చోటు దక్కాల్సి ఉందట. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కడంతో సాధ్యం కాలేదు. కేటీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్న వినయ్‌ అసంతృప్తి వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోవడం ఇప్పుడు కలిసి వస్తోందని సమాచారం.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన వినయ్ భాస్కర్ కు మంత్రికావడం చిరకాల కోరిక. అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రుల ప్రాతినిధ్యం తక్కువనే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ మంత్రులుగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు. ఇక ఉత్తర తెలంగాణకు రీజనల్ సెంటర్‌గా ఉన్న వరంగల్‌కు మరో మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ కూడా వస్తోంది. అదీ బీసీ నేతకే ఇవ్వాలని డిమాండ్ ఇంకా బలంగా వస్తోంది.  దీంతో ఈసారి తన చిరకాల కోరిక అయిన మంత్రి పదవి వినయ్  భాస్కర్ ని వరించేలానే కనిపిస్తోంది.