తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎక్కడాలేని ఉత్సాహంతో ఉంది. దుబ్బాక ఎన్నికలో గెలవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 48 స్థానాలు సాధించడంతో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ముందుగా పార్టీని తగినంతమంది నాయకులతో నింపాలని భావించిన అధిష్టానం మొదటగా కాంగ్రెస్ నుండి విజయశాంతిని పార్టీలోకి తీసుకొచ్చారు. ఎన్నికలకు ముందు నుండే విజయశాంతిని సంప్రదించిన కమలనాథులు ఎన్నికలు ముగియగానే పనిపూర్తిచేశారు. విజయశాంతి కూడ తన రాజకీయ ప్రస్థానం మొదలైన బీజేపీలోకే తిరిగి వెళ్లడాన్ని కొత్త ప్రయాణంగా భావిస్తున్నారు. అధిష్టానం సైతం ఆమెకు తగినంత ప్రాముఖ్యత ఇస్తోంది. ప్రతి సమావేశంలోనూ ఆమె అభిప్రాయాలకు, సూచనలకు స్థానం ఉంటోంది.
విజయశాంతికి తెలంగాణ ప్రజానీకంలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆమె లాంటి బలమైన మహిళా నాయకురాలు మరొకరిని ఆధునిక రాజకీయాల్లో తెలంగాణ ఓటర్లు చూడలేదు. ఉద్యమంలో కూడ ఆమె పాత్ర ఉంది. సినీ గ్లామర్ ఎలాగూ ఉండనే ఉంది. అందుకే ఆమెను స్టార్ కాంపైనర్ చేయాలని బీజేపీ అనుకుంటోంది. ప్రతి మీడియా సమావేశంలోనూ ఆమెకు మైక్ ఇస్తున్నారు. నిజానికి కేసీఆర్ గురించి విజయశాంతికి తెలిసినంతగా బీజేపీలో మరెవరికీ తెలియదు. ఆయన్ను అతి దగ్గర నుండి చూసిన వ్యక్తి ఆమె. ఆయన ఆలోచన విధానం, ప్లానింగ్ ఎలా ఉంటాయో ఆమెకు బాగా ఎరుక. అందుకే ఆమె ద్వారానే కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. విజయశాంతి కూడ పాత రాజకీయ పరిణామాలను లేవనెత్తుతూ కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నారు.
ఇక ఆమెను ఇంకొక అడుగు ముందు వేయించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. అదే బస్సు యాత్ర. త్వరలో బీజేపీ చేపట్టనున్న బస్సు యాత్ర బాధ్యతలన్నీ ఆమెకే అప్పగించాలని పార్టీ భావిస్తోందట. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లా కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాల్లోనూ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అన్నింటికీ రాములమ్మనే సారథ్యం. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, ఓటర్లను తమవైపుకు తిప్పుకోవాలనేది బీజేపీ ప్రధాన ఉద్దేశ్యం. అంతేకాదు ఒక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల నుండి చిన్నా చితకా లీడర్ల వరకు ఆకర్షించి పార్టీని బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్నారు. విజయశాంతి ప్రజాక్షేత్రంలో గట్టిగా గొంతెత్తి చాలా ఏళ్లు అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆమె సేవలను సరిగా ఉపయోగించుకోలేకపోయారు ఆ పార్టీ నాయకులు. కానీ బీజేపీ మాత్రం ఇకపై రాములమ్మ వాయిస్ నిత్యం ప్రజల్లో వినబడేలా చేయనుంది. మొత్తానికి ఈ బస్సు యాత్రతో బీజేపీకి కొత్త కళ తేనున్నారన్నమాట.