కేసీఆర్ పై ఉత్తమ్, ఒంటేరు సంచలన వ్యాఖ్యలు

గజ్వేల్ లో చాలా అరాచకాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. పోలీస్ వ్యవస్థ మొత్తం కేసీఆర్ కుటుంబానికి అనుకూలంగా పని చేస్తోందని, కేసీఆర్ అండతో పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని ఒంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల పై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ తో కలిసి ఒంటేరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే…

“కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్.. ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయా లేక ఏపీలోనా. నీకు కూటమిని ఎదుర్కొనే దమ్ములేక చంద్రబాబును అంటున్నావు. దమ్ముంటే మాతో మాట్లాడు. చంద్రబాబు ఎందుకు వస్తున్నాడు మధ్యలో. తమాషాలు చేస్తున్నావా. నీ తాగుబోతు మాటలు ప్రజలు నమ్మరు. సిగ్గుండాలే.. మాట్లాడితే.. ఒంటేరుకు వస్తున్న ప్రజాధరణ చూస్తే నీకు లాగు తడుస్తుంది. అందుకే ఒంటేరును నీ పోలీస్ రాజ్యంతో అణచాలని చూస్తున్నావు.. నీ ఆటలిక సాగవు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకేంది… తెలంగాణ నంబర్ 1 ద్రోహి నువ్వు కేసీఆర్… నీ బోగస్ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మరు”  అంటూ ఉత్తమ్ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏమన్నారంటే…

“గత నాలుగున్నరేళ్లలో తనపై 23 కేసులను ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టించారు.  మల్లన్నసాగర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే… ఫైరింగ్ చేయడమే కాకుండా, 42 మందిపై కేసులు పెట్టారు. ఇద్దరు ఎస్సైలు సూసైడ్ చేసుకున్నారని చెబుతుంటే… అవి సూసైడ్ లు కాదని హత్యలని తాను అన్నందుకు… వాటిపై కూడా కేసులు పెట్టారు.

రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ కేసీఆర్ ఫ్యామిలీకి అనుకూలంగా పని చేస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో గత 45 రోజులుగా హరీష్ రావు ప్రతి గ్రామంలో టెంట్లు వేసి మద్యం పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.  పోలీసులకు వీడియోలు చూపించినా పట్టించుకోలేదు. ఈ అన్యాయాలను నిరసిస్తూ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట తాను నిరాహారదీక్షకు దిగితే… పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారు.

సోమవారం నా ప్రచారం ముగించుకుని ఓ పెళ్లికి హాజరవుతుంటే నాలుగు జీపుల్లో పోలీసులు వచ్చి నన్ను అడ్డుకున్నారు. వారికి యూనిఫాం కూడా సరిగా లేదు. నేమ్‌ ప్లేట్‌లు లేవు. నేరుగా ఇంట్లోకి వచ్చి వస్తువులు చిందరవందరగా పడేసి, బీరువాలు సోదా చేశారు. ఏరా కేసీఆర్‌పై పోటీ చేస్తావురా! అంత ధైర్యముందారా నీకు. అమరావతికి వెళ్లి డబ్బులు తెస్తున్నావా?’ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు.

కేసీఆర్‌కు జ్ఞానం ఉండాలి. అమరావతికి వెళ్లి నేనెందుకు డబ్బులు తెస్తాను. నా ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారుగా.. నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలిసే ఉంటుంది. నేను అమరావతికి వెళ్లి డబ్బులు తెస్తే, కేసీఆర్‌, హరీశ్‌రావులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. 

ఆలీబాబా 40 దొంగలు వచ్చినట్లు రోజుకో వ్యక్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. నాపై పోటీ చేసే ధైర్యం లేక అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. నా దగ్గర డబ్బుల్లేవ్‌. ప్రజల కాళ్లు పట్టుకుని ఓట్లు అడుగుతున్నా… కేసీఆర్ దమ్ముంటే ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలలో పాల్గొను అంతే కానీ పిచ్చి పిచ్చిగా చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఒంటేరు కేసీఆర్ ను హెచ్చరించారు.