జనగాం తాజా మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వింత అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ముత్తిరెడ్డికి పలు గ్రామాలలో నిరసన సెగలు తాకగా ఓ గ్రామంలో ఏకంగా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు అప్పుడే ఓటు వేస్తామన్నారు. దీంతో ఖంగుతిన్న ముత్తిరెడ్డి మళ్ల అటువైపు చూడకుండా పారిపోయిండని గ్రామస్తులు తెలిపారు. ఇంతకీ అసలు కథ ఏంటంటే…
జనగామ తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి… ప్రస్తుతం టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటి చేస్తున్నారు. ఆయన ప్రచారంలో భాగంగా జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డి పల్లి గ్రామానికి వెళ్లారు. ఆయన వెళ్లగానే గ్రామస్థులు ఓ బాండ్ పేపర్ ను చూపించారు.
అయ్యా… ముత్తిరెడ్డి గారు.. మీరు గతంలో గెలిచి మా ఊరు అభివృద్దిని మరిచారు. మళ్లీ ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు. మేము మీకే వేస్తాం వేయమని అంటలేం కానీ నువ్వు గెలిచిన మరుక్షణమే మా ఊరికి ఈ పనులు చేస్తానని బాండు పేపర్ మీద సంతకం పెట్టాలన్నారు. అంతే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పత్తా లేకుండా పారిపోయారంట. పని చేయ చేతగానోనికి ఓట్లు ఎలా వేయాలంటూ ప్రజలు ప్రశ్నించారు. ప్రజల నిలదీతతో ముత్తిరెడ్డి ఉక్కిరి బిక్కిరయ్యారని తెలిసింది. ఇంతకీ ప్రజలు బాండ్ పేపర్లో కోరింది ఏంటంటే…
చెరువు నిర్మాణం
నాగిరెడ్డి పల్లి నుంచి కొన్నె బిటి రోడ్డు నిర్మాణం
గ్రామంలో మార్కెట్ నిర్మాణమునకు భూమి విరాళం
గ్రామస్థులు రాసిన బాండ్ పేపర్ కింద ఉంది చూడండి.
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి తమ గ్రామానికి చేసిందేం లేదన్నారు. తమ గ్రామంలోని పలువురు రైతులను బెదిరించి భూములు లాక్కునే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హయాంలో నీటి సౌకర్యాలు కూడా లేవన్నారు. తాగునీరు, సాగునీరుకు కటకటాలపాలయ్యామన్నారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పేందుకు వెళితే రేపు మాపు అంటూ పబ్బం గడిపేవారన్నారు.
సమస్యల పై నిలదీస్తే కసురుకునే వాడని అటువంటి వ్యక్తి ప్రజా సేవకు పనికిరాడన్నారు. ఎక్కడ చూసిన ముత్తిరెడ్డి బాగోతాలే ఉన్నాయని ఆ విషయాలు మేము చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అంతా ముత్తిరెడ్డి చరిత్ర తెలియదా అని నిలదీశారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధికారులకు వేధింపులు, రైతుల భూమి గుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని కళ్ల ముందు ఉన్నాయన్నారు. సమస్యలను పరిష్కరించమంటే పారిపోయిన ముత్తిరెడ్డి కి ఓటు వేసే ప్రసక్తే లేదన్నారు.
గతంలో కూడా ముత్తిరెడ్డి పలు వివాదాలలో చిక్కుకున్నారు. జనగాంలో పలు భూములను కబ్జా చేసుకునేందుకు ప్రయత్నించారు. రియల్ ఎస్టేట్ దందాలు చేసి వివాదాలలో చిక్కుకున్నారు. జనగాంలో చెరువును కూడా కబ్జా చేసే ప్రయత్నం చేయగా అప్పటి కలెక్టర్ అడ్డుకున్నారు. అప్పుడు అది పెద్ద వివాదంగా మారింది.
హైదరాబాద్ ఉప్పల్ లో కూడా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కబ్జాలకు పాల్పడ్డాడు. పలు వివాదాలలో చిక్కుకున్నాడు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. అధికారుల పై కూడా బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆది నుంచి వివాదాస్పదుడిగా పేరొందారు. ప్రజలు బాండ్ పేపర్ చూపించే సరికి సమాధానం చెప్పలేక పారిపోయారని గ్రామస్థులు తెలిపారు.