హైకోర్టు అడ్వకేట్ గట్టు వామన రావు, నాగమణి దంపతుల హత్య తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నడిరోడ్డుపై పట్టపగలు.. అంతా చూస్తుండగానే ఇద్దర్నీ అతి దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యపై ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ హత్యలను చేయించింది టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత అని బయటకు ప్రచారం జరుగుతుండగా, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై కూడా బలమైన అనుమానాలున్నాయి.
ఈ హత్యలపై టీఆర్ఎస్ స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైకోర్టు లాయర్లు… అందులోనూ ప్రజల పక్షాన కొట్లాడే లాయర్లను దారుణంగా నరికి చంపితే టీఆర్ఎస్ నేతలు మరీ ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ స్పందించిన తీరు దారుణంగా ఉందని మండిపడుతున్నారు. ఈ హత్యలో పోలీసులు, టీఆర్ఎస్ పెద్ద నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తుండగా… కేవలం కుంట శ్రీనును పార్టీ నుండి సస్పెండ్ చేసి టీఆర్ఎస్ చేతులు దులుపుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
న్యాయవాది జంట హత్యల కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. న్యాయవాదుల హత్య పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు పగడ్బందీగా సేకరించాలని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా హైకోర్టు న్యాయవాది హత్య కేసుకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన నివేదికను త్వరితగతిన సేకరించాలని ప్రభుత్వానికి, పోలీస్ శాఖ కు నోటిసులు జారీ చేసింది.