నల్లగొండలో టిఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఉద్యమ నేత గుడ్ బై

ఎన్నికల వేళ టిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కీలక నేతల రాజీనామాతో వరుస దెబ్బ తగులుతోంది. నల్లగొండ జిల్లా కీలకమైన నేత టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.

దుబ్బాక నరసింహా రెడ్డి

గతంలో నల్లగొండ ఇంచార్జీగా పనిచేసిన దుబ్బాక నరసింహారెడ్డి టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. దుబ్బాక నరసింహారెడ్డి నల్లగొండ అసెంబ్లీ నుంచి సీటు ఆశించారు. 2014 ఎన్నికల్లో దుబ్బాక నరసింహారెడ్డి టిఆర్ఎస్ తరపున పోటి చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఆయన టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీగా ఉన్నారు. ఇటీవల టిడిపి నేత కంచర్ల భూపాల్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనకు నల్లగొండ ఇంచార్జీ తో పాటు నల్లగొండ అసెంబ్లీ సీటు కేటాయించారు. దీంతో అప్పటి నుంచి దుబ్బాక నరసింహారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడితే కనీసం పట్టించుకోలేదని ఆయన అన్నారు. దుబ్బాక నరసింహారెడ్డి తన రాజీనామా పై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

“టిఆర్ ఎస్ పార్టీలో క్రమశిక్షణ లేదు. ఉద్యమకారులకు విలువ లేదు. నేను టిఆర్ఎస్ లో చేరిన దగ్గరి నుంచి పార్టీ కోసం పని చేశాను. 2014 లో అసెంబ్లీ సీటు కేటాయించారు. ఆ తర్వాత నామినేటేడ్ పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఇటివల కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించారు. అప్పుడు కూడా నామినేటేడ్ పదవి పై గుర్తు చేస్తే నేతలు కనీసం స్పందించలేదు. టిఆర్ఎస్ లో ఒంటెద్దు పోకడలున్నాయి.

 రౌడీలకు, గుండాలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. పార్టీలో విబేధాలు ఉన్నాయి. చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. వారు కూడా త్వరలోనే రాజీనామాలు చేస్తారు. నా తమ్ముడు దివంగత సతీష్ రెడ్డికి  నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్ధి వేముల వీరేశం బాకీ పడి ఉన్నాడు. తక్షణమే వీరేశం ఆ చెల్లింపులు చేయాలి. లేకపోతే నా అనుచరులు, కార్యకర్తలే ఆ డబ్బును వీరేశం ముక్కు పిండి వసూలు చేపిస్తారు. రౌడీ రాజకీయాలకు భయపడేది లేదు.

వేముల వీరేశం కమ్యూనిజం పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్నాడు. ఉద్యమాలు చేసి వచ్చిన, కమ్యూనిష్టు నాయకత్వం నుంచి వచ్చిన వాడినని చెప్పుకుంటున్నాడు. వీరేశం చేసే చేతలకు కమ్యూనిజానికి అసలు సంబంధం ఉందా అని అడుగుతున్నాను. వీరేశం పలు సంధర్బాలలో చేసిన వ్యాఖ్యల పై కమ్యూనిష్టు నేతలు కూడా స్పందించకపోవడం దారుణం. వీరేశానికి కమ్యూనిజం పేరు వాడుకునే అర్హత కూడా లేదు. ఈ విషయాన్ని కమ్యూనిస్టులే చెప్పాలి. 

మా కుటుంబానికి, నా తమ్మునికి అండగా నిలిచిన నేరడ గ్రామస్థులకు, నా అనుచరులకు, నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు  నేను రుణపడి ఉంటాను. గ్రామస్థుల అండదండ చూసి ఉద్వేగానికి లోనయ్యాను. మా కుటుంబం నలుగురికి మంచే చేసింది కానీ చెడు చేయలేదు. నా తమ్ముడి మరణం తర్వాత నేను చాలా మానసిక క్షోభకు గురయ్యాను. ఇంతలోనే పార్టీలో వేధింపులు మొదలయ్యాయి. టిఆర్ఎస్ లో చేరిన తర్వాత నేను చాలా ఖర్చు పెట్టాను. స్వంత డబ్బులతో పార్టీ అభివృద్ది కోసం ఖర్చు పెడితే నన్ను ఇవాళ రోడ్డు మీద నిలబెట్టారు. అన్ని వివరాలు త్వరలో చెబుతాను. నా రాజీనామా లేఖను టిఆర్ఎస్ భవన్ కు పంపుతున్నాను.” అని దుబ్బాక నరసింహా రెడ్డి తెలిపారు.  

ఇటీవల దుబ్బాక నరసింహారెడ్డి తమ్ముడు దివంగత సతీష్ కు వేముల వీరేశం 30 లక్షలు చెల్లించాలని గ్రామస్తులు ఆరోపించారు. వీరేశం నేరడ గ్రామానికి వస్తున్నాడని తెలుసుకొని గ్రామస్తులు గ్రామంలో బ్యానర్లు వేసి వీరేశాన్ని అడ్డుకుంటామని తీర్మానించారు. దీంతో భయపడ్డ వీరేశం గ్రామంలోకి ప్రచారానికి కూడా రాలేదు.

దుబ్బాక కేసీఆర్ కు రాసిన రాజీనామా లేఖ

టిఆర్ఎస్ పార్టీ పై అసంతృప్తిగా ఉన్నా దుబ్బాక నరసింహారెడ్డి ఈ ఘటన తర్వాత ఆలోచించుకోని పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది. దుబ్బాక నరసింహారెడ్డికి నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గ కార్యకర్తల పై మంచి పట్టు ఉంది. ఆయన రాజీనామాతో ఈ రెండు నియోజకవర్గాల్లో టిఆర్ ఎస్ నాయకుల పై దెబ్బ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

గులాం నబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన దుబ్బాక నరసింహా రెడ్డి 

నల్లగొండలో బద్ద శత్రువులైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డ ిమిత్రులయ్యారు. దుబ్బాక నరసింహారెడ్డి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో కాంగ్రెస్ లో చేరారు. గులాం నబీ ఆజాద్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు దుబ్బాక నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమయంలో అక్కడ ఉద్వేగ వాతావరణం నెలకొంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి ఆలింగనం చేసుకొని కొద్ది క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఈ సమయంలో ఇద్దరు కూడా కన్నీటి పర్వంతమైనట్టు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత వీరు కలుసుకున్నారు. వీరిద్దరు చాలా దగ్గరి బంధువులు. నల్లగొండలో అపూరూప సంఘటన జరగడంతో కార్యకర్తలు అంతా ఆనందం వ్యక్తం చేశారు. వీరిని చూసిన గులాం నబీ ఆజాద్ ఇద్దరి పై కూడా చేతులు వేసి భరోసానిచ్చారు. దుబ్బాక నరసింహారెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఏర్పడింది. వారంతా హర్షం వ్యక్తం చేశారు.