తెరాసకు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందా అంటే అయిందనే చెప్పాలి. అందుకు దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎలక్షన్లే సాక్ష్యాలు. తెలంగాణలో 2014-2018 మధ్యకాలంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇకపై ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుపుకుందామంటే కుదరదు. ఓటర్లు చూసీచూడనట్టు వెళ్లిపోయే రోజులు పోయాయి. ఇకపైన ఏం చేసినా పక్కాగా చేయాల్సి ఉంటుంది. గతంలో ఎన్నికలు ఏవైనా కేసీఆర్ చూచాయిగా సన్నాహకాలు చేయించేవారు. ఫలితాలు రెట్టింపు స్థాయిలో వచ్చాయి. ఆ చూచాయి వ్యవహారమే దుబ్బాకలో, హైదరాబాద్లో దెబ్బకొట్టింది. దుబ్బాకలో అభ్యర్థి ఎంపికపై తెరాస పెద్దగా దృష్టి పెట్టలేదనేది వాస్తవం.
సానుభూతి మీద భారం మొత్తం తోసేసి సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి టికెట్ ఇచ్చారు. సోలిపేట సుజాతగారు రాజకీయాలతో అస్సలు పరిచయంలేని వ్యక్తని ఓటర్లకు తెలుసు. గెలిచినా పెత్తనం మొత్తం హరీష్ రావుదో లేకపోతే ఇంకొకరిదో ఉంటుందని అర్థమైపోయింది. అందుకే ఆమె ఓటమిపాలయ్యారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకుంటే సిట్టింగ్ కార్పొరేటర్ల మీద అసంతృప్తి తారాస్థాయిలో ఉండింది. ఈ సంగతి గ్రహించిన కేటీఆర్ సిట్టింగ్లను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ పని అసంపూర్ణంగా చేశారు. కొత్తవారికి అవకాశం ఇచ్చిన చాలాచోట్ల పార్టీ గెలిచింది. కానీ సిట్టింగ్లు బరిలోకి దిగిన 50 శాతం స్థానాల్లో ఓడిపోయారు.
అంటే 70 నుండి 80 శాతం సిట్టింగులను మార్చాల్సి ఉండగా కేవలం 30 నుండి 40 శాతం వరకే మార్చారు. కాబట్టే 99 నుండి 55 కు పడిపోయింది స్థానాల కౌంట్. ఈ తప్పిదాన్ని గ్రహించిన హైకమాండ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ తప్పును రిపీట్ చేయకూడదని డిసైడ్ అయింది. అసలే జమిలి ఎన్నికల వాతావరణం కనబడుతోంది. మోదీ ముందస్తు ఎన్నికలు సన్నాహకాల్లో ఉన్నారని ఢిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాబట్టి ముందుకు దూసుకొచ్చే ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యేల పనితీరు మీద ఫోకస్ పెట్టారు. పనిచేసిన వారికి, మంచి పేరు తెచ్చుకున్నవారికే ఈసారి టికెట్లని తేల్చేశారట.
ఇంతకుముందులా సీనియర్లని, సొంత మనుషులని చూసీ చూడనట్టు పోయే పరిస్థితి లేదని సంకేతాలిచ్చేశారట. గ్రేటర్లో సంపూర్ణ మెజారిటీ రాకపోవడం ప్రభుత్వానికి పెద్ద నష్టం కాదు. అదే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగితే పరిణామాలు వేరేలా ఉంటాయి. బీజేపీ రాజకీయం మొదలెడుతుంది. దాన్ని తట్టుకోవడం కేసీఆర్ కు దాదాపు అసాధ్యమే అవుతుంది. ఉన్నపళంగా పార్టీల గమనాన్ని మార్చేయడం బీజేపీ అధిష్టానానికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే అంత దూరం తెచ్చుకోకుండా కఠినంగా వెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఈ నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. దయాదాక్షిణ్యాలు లేకుండా పక్కనపెట్టేస్తారని ట్రాక్ రికార్డ్ తిరగేసుకుంటున్నారట. చూడాలి మరి ఈసారి ఎంతమంది సిట్టింగ్లు తిరిగి టికెట్ పొందగలరో.