టిఆర్ఎస్ కు బిగ్ షాక్, తెర పైకి తొలి రెబెల్

తెలంగాణలో మాంచి ఊపు మీదున్న టిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. చిన్న వివాదం లేకుండా 105 మందితో తొలి జాబితా వెలువరించామని జబ్బలు చరుచుకుంటున్న వేళ తొలి రెబెల్ సీన్ లోకి ఎంటరయ్యారు. ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా చేయగలిగామని అనుకుంటున్నవేళ రెబెల్ రంగం ప్రవేశంతో టిఆర్ఎస్ లో అలజడి రేపుతున్నది. మహా కూటమిని మట్టికరిపిస్తామని ముందుకు సాగుతున్న వేళ అసమ్మతి బహిర్గతం కావడం కలవరం రేపుతున్నది. తిరుగుబాటు చేసిన తొలి రెబెల్ ఎవరు? పార్టీ ప్రకటించిన అభ్యర్థి మీద పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేసిన ఆయనది ఏ బ్యాచ్ ? బిటి బ్యాచ్ లీడరా? ఉద్యమ తెలంగాణ నాయకుడా? చదవండి పూర్తి వివరాలు.

కావేటి సమ్మయ్య.. ఈ పేరు తెలంగాణ వాదులందరికీ సుపరిచితమే. టిఆర్ఎస్ మొదలైన రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కావేటి సమ్మయ్య, ఆయన సతీమణి (మాజీ మున్సిపల్ ఛైర్మన్) టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో శక్తివంచన లేకుండా పనిచేశారు. తెలంగాణ కోసం పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశమే శాసనంగా భావించి రాజీనామాలు చేసిన నాయకుడు కావేటి సమ్మయ్య. అటువంటి నాయకుడు ఇప్పుడు టిఆర్ఎస్ లో బిటి బ్యాచ్ హడావిడితో మరుగునపడిపోయారు. ఎంతగా మరుగున పడిపోయారంటే తుదకు ఆయనతో పనే లేదన్నట్లుగా పాతాలానికి పడేశారు. ఉద్యమ కాలంలో గులాబీ జెండాలు మోసి పార్టీని నిలబెట్టిన ఆయనను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. తదుకు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఏ ఒక్క పెద్ద లీడర్ వచ్చి పరామర్శించలేదని ఆయన అనుచరులు ఆవేదనతో చెబుతున్నమాట.

కావేటి సమ్మయ్య 2009లో టిఆర్ఎస్ తరుపున మహా కూటమిలో భాగంగా సిర్పూర్ లో గెలిచారు. అప్పుడు ఆయన ప్రత్యర్థి సీమాంధ్ర సెటిలర్ అయిన కోనేరు కోనప్ప. కోనేరు కోనప్ప 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మీద కావేటి సమ్మయ్య గెలిచారు. 2009 ఎన్నికలు ముగిసిన కొద్దిరోజుల్లోనే ఉమ్మడి రాష్ట్ర సిఎం వైఎస్సార్ మరణించడంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, కేసిఆర్ ఆమరణ దీక్షకు కూర్చోవడం, తెలంగాణ ప్రకటన రావడం, మళ్లీ వెనక్కు తీసుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి. ఆ సమయంలో టిఆర్ఎస్ మూకుమ్మడి రాజీనామాలకు దిగింది. అప్పుడు 2010లో రాజీనామా చేశారు కావేటి సమ్మయ్య.

అయితే అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో ఇప్పటి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం సిర్పూర్ లో కావేటి సమ్మయ్య మీద పోటీకి దింపింది. అయినా ఉద్యమ ఊపులో కావేటి సమ్మయ్య ఇంద్రకరణ్ రెడ్డిని మట్టి కరిపించారు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం 2009లో ఎవరి మీద అయితే గెలిచారో సీమాంధ్ర సెటిలర్ కోనేరు కోనప్ప చేతిలో ఓడిపోయారు సమ్మయ్య. కోనేరు కోనప్ప, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ ను వీడి బిఎస్పీ నుంచి పోటీ చేశారు. తర్వాత బంగారు తెలంగాణ కోసం వారిద్దరూ టిఆర్ఎస్ లో చేరిపోయారు. అందులో ఒకరైన అల్లోలకు కేసిఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇదంతా గడిచిన చరిత్ర.

మీడియా సమావేశంలో తాను సిర్పూర్ లో రెబెల్ గా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన కావేటి సమ్మయ్య

ఇక ఎప్పుడైతే కోనేరు కోనప్ప బిటి బ్యాచ్ రూపంలో టిఆర్ఎస్ లో చేరిపోయారు అప్పటి నుంచి కావేటి సమ్మయ్యకు కష్టాలు మొదలయ్యాయి. పార్టీలో పలుకుబడి తగ్గింది. పార్టీ నేతలు ఆయనను దూరం పెట్టేశారు. ఒక దశలో ఆయన ఆరోగ్యం బాగాలేకుంటే వచ్చి పరామర్శించిన నాథుడే లేడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లో బిటి బ్యాచ్ తో పొసగకపోయినా కావేటి సమ్మయ్య టిఆర్ఎస్ లోనే ఉన్నారు. అయితే ఒక దశలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం సాగింది. కానీ తాను టిఆర్ఎస్ లోనే ఉంటానని, కాంగ్రెస్ లో చేరబోనని ప్రకటించారు.

ఈ పరిస్థితుల్లో కావేటి సమ్మయ్య ప్రతిష్ట టిఆర్ఎస్ లో మసకబారుతూ వస్తున్నది. ఇక అసెంబ్లీ రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు కేసిఆర్ దిగారు. అయితే సిట్టింగ్ సీట్లలో వారినే అభ్యర్థులుగా ప్రకటిస్తూ 105 మందితో జాబితా ప్రకటించారు కేసిఆర్. ఈ నేపథ్యంలో బిటి బ్యాచ్ అందరికీ టికెట్లు వచ్చాయి. బంగారు తెలంగాణ కోసం వచ్చినవాళ్లంతా పార్టీలో కుషీగా ఉన్నారు. కానీ ఉద్యమ తెలంగాణ (యుటి) బ్యాచ్ లో కలవరం రేగింది. పార్టీ కోసం, తెలంగాణ కోసం పోరాడిన వారిలో కావేటి సమ్మయ్య లాంటి వాళ్లకు మొండిచేయి చూపబడింది.

ఈ పరిస్థితుల్లోనే కావేటి సమ్మయ్య పార్టీకి ఎదురు తిరిగారు. పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. బుధవారం పార్టీ ప్రకటించిన కోనేరు కోనప్ప మీద తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. తన సతీమణితోపాటు ముఖ్య అనుచరులతో కలిసి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెబెల్ గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో కావేటి సమ్మయ్య కేవలం 8వేల చిల్లర ఓట్ల తేడాతోనే కోనేరు కోనప్ప మీద ఓటమిపాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయన రెబెల్ గా బరిలోకి దిగితే కోనప్ప పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోనప్ప అనే వ్యక్తి సీమాంధ్ర సెటిలర్ గా ఉన్నారు. అది ఆయనకు మైనస్ అయ్యు అవకాశం ఉంది. మరోవైపు కోనప్ప కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. కావేటి సమ్మయ్య మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. సిర్పూర్ లో మున్నూరు కాపు ఓటింగ్ శాతం ఎక్కువ. పైగా ఆయన మీద సానుభూతి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ అఫిషియల్ క్యాండిడెట్ గెలవడం అంత ఈజీ కాదన్న వాతావరణం సిర్పూర్ లో నెలకొంది.

మీడియా సమావేశంలో కావేటి సమ్మయ్య ఏం మాట్లాడారో కింద చదవండి.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాపై వందల కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుడైన నన్ను కాదని ఆంధ్ర వలస వాది కోనేరు కోనప్పకు సిర్పూర్ లో టిక్కెట్ ఇవ్వడం నిజంగా చాలా దారుణం. తెలంగాణ ఉద్యమంలో నాపై వందల కెసులు నమోదైన సంగతి కేసిఆర్ గారికి తెలియంది కాదు. నాపై అబద్ధాలు, మాయ మాటలు చెప్పి కేసీఆర్ కుదగ్గరైన వారికే టికెట్ ఇస్తారా? సిర్పూర్ నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా ఉన్న బిసిలను కాదని కెవలం 500 ఓట్లు ఉన్న అగ్రకులానికి చెందిన ఆంధ్ర వలసవాదికి టికెట్ ఇవ్వడం దారుణం. 2014 ఎన్నికలలో స్వల్ప తేడాతొ ఓడిపొయిన నేను కేసీఆర్ మాటె శీరోధార్యంగా భావించాను. సిర్పూర్ లొ మొదట టిఆర్ఎస్ జెండా పట్టి పల్లె పల్లెలో తిరిగినపుడు నన్ను, కేసిఆర్ ను పిట్టల దొర గా చెప్పిన ఆంధ్ర వలస వాది ఈ కోనేరు కోనప్ప. అటువంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు? త్వరలో జరగనున్న ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గ ప్రజల మద్దతు, ఆశీర్వాదం తో రెబల్ గా బరిలో ఉంటాను. సీమాంధ్ర వలసవాదికి తెలంగాణ సత్తా ఏంటో రుచి చూపిస్తాను.

 

ఇది కూడా చదవండి

హైదరాబాద్ లో బంగారం ధరలు

 

ఇది కూడా చదవండి

‘‘ తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి , దానం నాగేంద‌ర్‌, తీగల కృష్ణారెడ్డిలను పార్టీలో చేర్చుకొని పెద్ద పీట వేసినప్పడు మీకు సిగ్గు అనిపించలేదా? ’’

కెసియార్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ