తెలంగాణలో ఈ ఐదుగురు మంత్రులు గెలిచేది కష్టమేనట

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై అందరికి ఉత్కంఠ మొదలయ్యింది. మరో 40 గంటల్లో అభ్యర్దుల భవితవ్యం బయటపడనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు ఓటమికి చేరువలో ఉన్నట్టు తెలుస్తోంది. వారు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు కూడా. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వారు ఎమ్మెల్యేగా గెలవడం కష్టమేనని తెలుస్తోంది. ఆయా మంత్రులు కూడా వారి సన్నిహితుల వద్ద ఇంత టైట్ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారని నాయకులు తెలిపారు. ఏది ఏమైనా తెలంగాణ ఎన్నికలలో ఎవరు కింగ్ అనేది మాత్రం మంగళవారం బద్దలు కానుంది.

కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఐదుగురు మంత్రులు ఓటమికి చేరువలో ఉన్నారని సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఆయా నియోజకవర్గ నేతలు కూడా వారి గెలుపు అంత ఈజీ కాదని చర్చించుకుంటున్నారు. అందులో మొదటగా ఉన్నది ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అజ్మీరా చందూలాల్. ఆజ్మీరా చందులాల్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.

అజ్మీరా చందులాల్

చందులాల్ మంత్రిగా ఉన్న కనీసం ఏ రోజు కూడా ప్రజల అభివృద్ది గురించి పట్టించుకోలేదనే విమర్శ ఉంది. ఆయన నియోజకవర్గానికి తప్ప ఆయన రాష్ట్రమంతా పర్యటించలేదని స్వంత పార్టీ కార్యకర్తలే విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నా కూడా గిరిజనుల సమస్యలు పరిష్కరించలేదని గిరిజన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గొండులకు, లంబాడీ తెగలకు గొడవలు అయినప్పుడు కూడా కనీసం సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదనే విమర్శ ఉంది. మంత్రిగా ఉండి కూడా ములుగులోకనీసం రోడ్లు, డ్రైనేజి, నీటి సమస్యలు పరిష్కారించలేదని గిరిజనులు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగులో కూటమి అభ్యర్ధి సీతక్క గెలుపు ఖాయమని, చందులాల్ కు ఓటమి తప్పదని చర్చ జరుగుతోంది.

సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ఓటమి కూడా ఖాయమని చర్చ జరుగుతోంది. జగదీష్ రెడ్డి ముందుగా విద్యాశాఖ మంత్రిగా ఆ తర్వాత విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ముఖ్యంగా సబ్ స్టేషన్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం, పర్మినెంట్ చేసే విషయంలో జగదీష్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.

జగదీష్ రెడ్డి

సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహించినా ప్రజలకు అందుబాటులో లేరనే అపవాదు ఉంది. మంత్రిని కలవాలంటే హైదరాబాద్ రావాల్సిందేనని వచ్చినా సమస్యను పరిష్కరించడంలో జగదీష్ రెడ్డి చొరవ చూపేవారు కాదని తెలుస్తోంది. జగదీష్ రెడ్డికి కోపం ఎక్కువని ఎవరైనా సమస్య చెప్పడానకి వస్తే కసురుకునే వారని తెలుస్తోంది. అధికారులను సైతం భయపెట్టేవారని విమర్శలు ఉన్నాయి. సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేశారు తప్ప సాధించిన అభివృద్ది  ఏం లేదని తెలుస్తోంది. కూటమి నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బిజెపి నుంచి సంకినేని వెంకటేశ్వరరావు… సూర్యాపేటలో జగదీష్ రెడ్డికి గట్టిపోటినిచ్చారు. సంకినేని వెంకటేశ్వరరావు బిజెపి నుంచి గెలుస్తారని తెలుస్తోంది.

తాండూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి ఓటమి తప్పదని తెలుస్తోంది. పట్నం మహేందర్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా చేసిన తాను భూములు, ఇండ్లు కూడబెట్టుకొని సంపాదించుకున్నారే తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని విమర్శలు ఉన్నాయి. రైతులను కూడా బెదిరించి భూ కబ్జాలకు పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి.

పట్నం మహేందర్ రెడ్డి

 రాజకీయంగా రంగారెడ్డి జిల్లాలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా పని చేశారట. మిగతా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆధిపత్యం కొనసాగకుండా మహేందర్ రెడ్డి రాజకీయం చేశారని తెలుస్తోంది. మహేందర్ రెడ్డి పోరు తట్టుకోలేకే చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని విశ్వేశ్వర్ రెడ్డే తెలిపారు. మహేందర్ రెడ్డి అధికార గర్వంతో విర్ర వీగారు కానీ  ఏ నాడు కూడా ప్రజలను పట్టించుకోలేదని తెలుస్తోంది. తాండూర్ లో మహా కూటమి అభ్యర్ధి పైలట్ రోహిత్ రెడ్డి గెలుస్తారని ప్రజలల్లో చర్చ జరుగుతోంది.

తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ లోని సనత్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటమి కూడా ఖాయమని తెలుస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం సినిమాటోగ్రఫి, పాడి పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన టిడిపి నుంచి గెలిచి టిఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్దిలో తలసాని వెనుకబడ్డారని ప్రజలు విమర్శిస్తున్నారు. తన సెటిల్ మెంట్లు, భూ కబ్జాలే చూసుకునే వారు కానీ ప్రజలకు ఆయన చేసిందేం లేదని తెలుస్తోంది. ప్రజలను నిర్లక్ష్యం చేశారని కనీసం ఏ నాడు కూడా నియోజకవర్గం పర్యటించలేదనే అపవాదు ఉంది. ఈ ఎన్నికల్లో తలసాని ఓడిపోవడం ఖాయమని టిడిపి నుంచి కూన వెంకటేష్ గౌడ్ గెలుస్తారని ప్రజలల్లో చర్చ జరుగుతోంది.

ఇంద్ర కరణ్ రెడ్డి

నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా  ఉన్నారు. ఆయన ప్రజలను నిర్లక్ష్యం చేశారని విమర్శలు ఉన్నాయి. నిత్యం హైదరాబాద్ లోనే ఇంద్రకరణ్ రెడ్డి ఉండే వారని ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించేవారని తెలుస్తోంది. నాయకులతో కూడా ఇంద్రకరణ్ రెడ్డి సరిగా ఉండే వారని తెలుస్తోంది. నిర్మల్ లో కాంగ్రెస్ అభ్యర్ది గెలుస్తారని చర్చ జరుగుతోంది.  

వీరి బాటలనే మరికొంత మంది నేతలు కూడా  ఓడిపోయే దశలో ఉన్నారని తెలుస్తోంది. మరి కొంత మంది ఎమ్మెల్యే అభ్యర్దులు అయితే ఏకంగా తమ పరిస్థితి తెలుసుకొని అనుచరుల వద్ద కన్నీరు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఎందుకింత టఫ్ పొజిషన్ వచ్చింది. తాము ఏం తక్కువ చేశామని బాధ వ్యక్తం చేశారట. ఓ వైపు కోట్ల రూపాయల ఖర్చు చేసిన ఫలితం దక్కకపోవడం పై నేతలు ఆందోళనగా ఉన్నారట. మంత్రులు గా పని  చేసిన వారు కనీసం ఎమ్మెల్యేగా  గెలవలేకపోతారనే చర్చ తెలంగాణ ప్రజలల్లో జోరుగా సాగుతోంది.