తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ.. ఇది గత ఏడేళ్ల నుండి వినిపిస్తున్న మాట. కేసీఆర్ ప్రాణత్యాగానికి పూనుకుని ఉడకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని తెరాస నాయకులు చెబుతుంటారు. కేసీఆర్ సైతం అనేక సందర్భాల్లో నేను లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. అంతెందుకు తాజాగా జరిగిన సిద్ధిపేట సభలో కూడ కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని అన్నారు. 2014 ముందు తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట సమితులు, రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ప్రాణ త్యాగాలు జరిగాయి. రాష్ట్ర కాంగ్రెస్ శాఖ సైతం ఆనాడు అధికారంలో ఉన్న యూపీఏతో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరింది. తీరా రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క కేసీఆర్ మాత్రమే ఎలివేట్ అయ్యారు.
వీరోచితంగా పోరాడిన విద్యార్థులు కనుమరుగయ్యారు. పోరాట సమితులన్నీ చెల్లాచెదురయ్యాయి. ప్రొఫెసర్ కోదండరాం లాంటి నాయకుల పరిస్థితి ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. చెప్పాలంటే ఉద్యమ ఫలాలను అందరికంటే కేసీఆర్, ఆయన కుటుంబమే ఎక్కువగా అనుభవిస్తున్నారనేది వాస్తవం. ఇదే విషయాన్ని ఇతర పార్టీల నాయకులు, పోరాటంలో కీలకంగా వ్యవరించిన వ్యక్తులు అనేకసార్లు చెప్పారు. తాజాగా 1969 ఉద్యమకారుల సమితి అధ్యక్షుడుగా పనిచేసిన మేచినేని కిషన్‌రావు కూడ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. సిద్దిపేటలో కేసీఆర్ తన వలనే తెలంగాణ ఏర్పడిందని అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 1969లోనే తెలంగాణ రాష్ట్రం కోసం బీజం పడిందని వందలాది ఉద్యమ సంస్థలు పోరాటంలో పాల్గొన్నాయని, ఉద్యమ చివరి దశలో ఉండగా హరీష్ రావు మధ్యవర్తిత్వంతో అన్ని పోరాట సమితులు కలిసి ఒకటిగా చేరాయని అన్నారు.
కాళోజీ నారాయణరావుగారి సలహా మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటుచేయగా దానికి కేసీఆర్ అధ్యక్షుడిగా, తాను ప్రహన్ కార్యదర్శిగా వ్యవహరించినట్టు చెప్పుకొచ్చారు. ఆనాడు నక్సలైట్లు కూడ ఉద్యమానికి మద్దతిచ్చారని గుర్తుచేసుకున్నారు. అలా అందరి కృషితో, వందల మంది ప్రాణత్యాగాలతో రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు కేసీఆర్ తన వలనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని అనడం భావ్యం కాదని, వెంటనే ఆయన మాటను వెనక్కి తీసుకుని తెరాసను రద్దుచేయాలని లేకుంటే ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. తెరాస అధికారంలోకి వచ్చాక జరిగిన అక్రమాలను, అవినీతిని నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి బయటకు తీస్తానని కూడ అన్నారు. ఇలా ఉద్యమంలో, తెరాస ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఉద్యమ నేత బయటపెట్టిన ఈ సంగతుల పట్ల కేసీఆర్, తెరాస నేతలు ఎలా స్పందిస్తారు, అసలు స్పందిస్తారా లేదా అనేది చూడాలి.