కేసిఆర్ ను నమ్మి నాశనమైపోయినం : ఓయూ స్టూడెంట్ (వీడియో)

తెలంగాణ ఆపద్ధర్మ సిఎం కేసిఆర్ మీద ఒక ఉస్మానియా విద్యార్థి భగ భగ మండిపడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆ యువకుడు నేడు నాలుగున్నరేళ్ల తెలంగాణలో జరుగుతున్న పాలన చూసి రగిలిపోయాడు. ఏదైతే అదైంది అంటూ తన ఆవేదనను సెల్ఫీ వీడియో రూపంలో వెల్లడించి సోషల్ మీడియాలో వదిలాడు. ఇప్పుడు ఆ వీడియో చక్కర్లు కొడుతున్నది.

పాలమూరు జిల్లాకు చెందిన కుర్మయ్య ఉస్మానియాలో చదువుకున్నడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నవేళ కుర్మయ్య ఉస్మానియా విద్యార్థి. సి హాస్టల్ లో ఉన్నాడు. ఆ సమయంలో తాను సైతం అంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొ్న్నాడు. ప్రస్తుతం ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు కుర్మయ్య.

కేసిఆర్ పాలన మీద తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశాడు కుర్మయ్య. తనను ఏమో చేస్తారన్న భయం లేదని, తన బాధను, ఆవేదనను మాత్రం వెల్లడించి తీరతానని వీడియోలో చెప్పాడు. బర్రెలు, గొర్రెలు పంచుడు అంటే ఉద్యోగాలిచ్చినట్లే టిఆర్ఎస్ సర్కారు మాట్లాడుతున్నదని మండిపడ్డాడు. ఈ బర్రెలు, గొర్రెల కోసమేనా తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నది అని ప్రశ్నించాడు.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి వేసిన నోటిఫికేషన్లు కూడా వేయకపోతివి కేసిఆర్ అని నిలదీశాడు. కేసిఆర్ ను నమ్మి నిలువునా నాశనమైపోయామని బాధపడ్డాడు. పొద్దున లేస్తే సన్నాసులు, దద్దమ్మలు, చవటలు, లంగలు,లఫంగలు అంటూ కేసిఆర్ బూతులు తిట్టడం చూస్తే తెలంగాణ ప్రజలంతా ఇలాగే గలీజు భాష మాట్లాడతారేమో అన్న భావన కల్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చినట్లు కేసిఆర్ చెప్పుకోవడం శుద్ధ అబద్ధమన్నాడు. 1200 మంది ఆత్మబలిదానాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు,  మాటలొచ్చిన పోరగాళ్లు కూడా జై తెలంగాణ అని ఉద్యమం చేస్తేనే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ ఇచ్చారు తప్ప నీ ఒక్కడి ఘనత ఏమీ కాదని తేల్చి చెప్పాడు.

పార్టీలు మారిన పందికొక్కులను పక్కన కూసోబెట్టుకుని సభల్లో కేసిఆర్ మాట్లాడే మాటలకు వివువేముందని నిలదీశాడు. ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతచారి జై తెలంగాణ అని ఆత్మబలిదానం చేసుకున్నాడు తప్ప అమ్మా అయ్య అని అనలేదని గుర్తు చేశాడు. అలాంటి శ్రీకాంతచారి తల్లికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించాడు.

లక్ష ఉద్యోగాలొస్తాయని నమ్మబలికి యువతను లుచ్చాలను చేసిండని మండిపడ్డాడు. ఇంటికో ఉద్యోగం అని నమ్మించి నాశనం చేసిండని ఆవేదన వ్యక్తం చేశాడు. కేజి టు పిజి ఉచిత విద్య అని మాయమాటలు చెప్పిండన్నాడు. నీ మనవడు, నా మనవడు ఒకే బడిలో చదువుతరని మాయమాటలు చెప్పిండని అన్నాడు.

తెలంగాణలో వంద సభలు పెడతానని కేసిఆర్ మాట్లాడతున్నాడని, ఆయనకు దమ్ముంటే వేల మంది పోలీసులను తీసుకొచ్చి ఓయులో సభ పెట్టాలని సవాల్ చేశాడు. నిరుద్యోగ యూత్ అంతా తెలంగాణ పాలన మీద చర్చించుకుని రానున్న రోజుల్లో మల్లా కేసిఆర్ పాలన అవసరమా కాదా చర్చించుకోవాలని పిలుపునిచ్చాడు. 

ఉస్మానియా ఉద్యమకారుడైన కుర్మయ్య మాట్లాడిన సెల్ఫీ వీడియో కింద ఉంది చూడండి. ఆయన ఆవేదన ఎలా ఉందో…

 

ou student video