చీటింగ్ కేసులో టిఆర్ఎస్ నాయకుడు యామాద్రి భాస్కర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. పలువురిని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడడమే కాకుండా పార్టీని అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన యామాద్రి భాస్కర్ టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలో ఉన్నత పదవి కోసం కూడా భాస్కర్ తీవ్ర ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీలో ఉన్నత పదవి లభించకపోవడంతో గత కొంత కాలంగా టిఆర్ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పట్టణంలో పలు ఆగడాలు చేశారని ఆరోపణలున్నాయి.
పలువురిని బెదిరించి అక్రమంగా దందాలకు పాల్పడినట్టు తేలింది. పట్టణంలో ఎవరైనా కొత్త ఇండ్లు కట్టినా, కొన్నా భాస్కర్ కు కమిషన్ పోవాల్సిందే. ప్లాట్ల అమ్మకాలలో కూడా భాస్కర్ కు కమిషన్ ఇవ్వాల్సిందేనట. పోలీసు కేసులలో సెటిల్ మెంట్లు చేసి పైసలు తీసుకునేవాడని తెలుస్తోంది. ఇలా భాస్కర్ చేతలతో విసిగిపోయిన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ముందుగా భాస్కర్ పై కేసు నమోదు చేయాలంటే ఆలోచించారని ఆ తర్వాత కేసు నమోదు చేశారని బాధితులు తెలిపారు. దీంతో భాస్కర్ ను అదుపులోకి తీసుకొని విచారించి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. బెదిరింపు చీటింగ్ కేసులో భాస్కర్ నుంచి 2 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టిఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.