కాంగ్రెస్ టికెట్ కోసం టిఆర్ఎస్ తాజా మాజీ మంతనాలు

 

ఆయన తాజా మాజీ ఎమ్మెల్యే. ఉన్నట్లుండి అసెంబ్లీ రద్దు కావడంతో అందరు టిఆర్ఎస్ సిట్టింగ్ ల మాదిరిగానే తనకూ టికెట్ వస్తదని ఆశ పడ్డడు. కానీ అసెంబ్లీ రద్దయిన రోజే 105 మందికి టికెట్లు ఖరారు చేసిండు కేసిఆర్. కానీ ఆ లిస్ట్ లో ఈ పెద్ద మనిషి పేరు గయబ్ అయింది. అదేందంటే ఈ పెద్ద మనిషితోపాటు మరికొందరి పేర్లు పెండింగ్ ల పెట్టినమని కేసిఆర్ ప్రకటించిర్రు. మరో వారం పది రోజుల్లోనే ఈ పెద్ద మనిషితోపాటు మిగతా వారి పేర్లు కూడా ప్రకటిస్తమని అన్నరు. కానీ గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే తనకు టికెట్ రాదని ఈ పెద్ద మనిషికి గుబులు పట్టుకుంది. టిఆర్ఎస్ లో టికెట్ వచ్చే చాన్స్ లేకపోతే కాంగ్రెస్ టికెట్ ట్రై చేద్దామని కాంగ్రెస్ పెద్ద లీడర్ ఇంటి తలుపు తట్టిండు.  ఇంతకూ ఎవరా పెద్ద మనిషి ఏమిటా కథ? చదవండి.

105 మంది జాబితాలో లేని పేరు లేని వారిలో మేడ్చల్ తాజా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతోపాటు మల్కాజ్ గిరి కనకారెడ్డి, కొండా సురేఖ, చొప్పదండి బొడిగె శోభ ఉన్నారు. వారితోపాటు ఇద్దరు సిట్టింగ్ లకు టికెట్లు గల్లంతయ్యాయి. వారిలో బాబూమోహన్, చెన్నూరు నల్లాల ఓదేలు ఉన్నారు. వీరి స్థానాల్లో జర్నలిస్టు నేత క్రాంతి, ఎంపి బాల్క సుమన్ ను ఖరారు చేశారు. ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ లో టికెట్ రాదన్న ఆందోళనతో ఉన్న మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

చివరి ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివరిగా కేసిఆర్ తనయుడు కేటిఆర్ ను కలిశారు సుధీర్ రెడ్డి. తనతోపాటు ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావును కూడా తీసుకుపోయిండు. అంతేకాకుండా ఘట్కేసర్ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, శామీర్ పేట ఎంపిపి చంద్రశేఖర్ యాదవ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ లను కూడా తీసుకువెళ్లి కేటిఆర్ ను కలిసినట్లు తెలిసింది. అయితే టికెట్ లేదని కేటిఆర్ కరాఖండిగా తేల్చి చెప్పేశారట. సర్వేల్లో సుధీర్ రెడ్డికి 20 శాతమే గెలుపు అవకాశాలొచ్చాయని, ఈ పరిస్థితుల్లో టికెట్ మాత్రం ఇవ్వలేమని కేటిఆర్ స్పష్టం చేశారు. వేరే రకంగా ఆదుకుంటామన్నారు. కానీ టికెట్ విషయం అడగొద్దు అని కేటిఆర్ క్లియర్ గా చెప్పినట్లు తెలిసింది.

మేడ్చల్ టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

సర్వేల్లో కార్యకర్తల బలం 20శాతమే ఉందని, ప్రజల్లో కూడా బలం 20 శాతమే ఉందని తేలినట్లు తెలిసింది. ఈ సర్వే రిపోర్టులు చూపించి నీకు టికెట్ లేదు అని కేటిఆర్ చెప్పినట్లు అంటున్నారు. అంతేకాకుండా భూకబ్జాల ఆరోపణలు, మహిళలు, మహిళా ఉద్యోగులను అవమానకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మలిపెద్ది సుధీర్ రెడ్డి. ఈ అన్ని అంశాలను కేటిఆర్ ఏకరువు పెట్టినట్లు తెలిసింది.

అయితే ఇక టిఆర్ఎస్ లో టికెట్ రాదని తేలడంతో తన మేనమామ అయిన జైపాల్ రెడ్డి ఇంటి గడప తొక్కారు సుధీర్ రెడ్డి. అయితే టికెట్ విషయంలో గ్యారెంటీ ఇవ్వలేనని జైపాల్ తేల్చి చెప్పారట. ఒకవేళ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ వీడి టిఆర్ఎస్ లోకి పోతే మాత్రమే తాను సాయం చేయగలనని ఆయన అన్నట్లు తెలిసింది. కేఎల్ఆర్ పార్టీలో ఉంటే టికెట్ కష్టమే అన్నట్లు తెలిసింది.

మలిపెద్ది కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డిని కలిసినట్లు తెలియగానే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆశావహులుగా ఉన్నవారంతా సమావేశమైనట్లు తెలిసింది. వారంతా సుధీర్ రెడ్డి రాకను శక్తివంచన లేకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారట. వారిలో ఎవరికి టికెట్ వచ్చినా మిగతా వారంతా పనిచేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ సుధీర్ రెడ్డికి మాత్రం కాంగ్రెస్ టికెట్ రాకుండ అడ్డుకోవాలని వారు అనుకున్నారు. అలా అనుకున్న వారిలో తోటకూర జంగయ్య యాదవ్, ఉద్దెమర్రి నర్సింహ్మారెడ్డి, ఘట్కేసర్ రామిరెడ్డి, వేముల మహేష్ గౌడ్, కట్టా జనార్దన్ రెడ్డి ఉన్నారు.

మేడ్చల్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ టికెట్ రేసు లో ఉన్నారు ఆయనతోపాటు టిడిపి నుంచి రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ లో చేరిన తోటకూర జంగయ్య యాదవ్ కూడా టికెట్ రేస్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం, బిసి సామాజికవర్గం కావడంతో తనకు టికెట్ ఖాయం అని జంగయ్య యాదవ్ వర్గం చెప్పుకుంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో జంగయ్య యాదవ్ పై కెఎల్ఆర్ నోరు పారేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కెఎల్ఆర్ ఇరకాటంలో పడ్డారు.

ఇదే సమయంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కారెక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఆ రూమర్స్ ను కెఎల్ఆర్ ఖండించారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే మహా కూటమి దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇక్కడ టిడిపి సీటు కోరుతుందా? లేక కాంగ్రెస్ తీసుకుంటుందా అన్న చర్చ ఉంది. ఈ పరిస్థితుల్లో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో టికెట్ ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశమైంది.