హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికల్లో విశేషం ఏంటంటే తెలంగాణ ఆవిర్భావం నుండి ప్రతిఎన్నికల్లో దూకుడు తగ్గకుండా జోరుసాగించిన కారుకు తొలిసారి బ్రేక్ పడింది. చివరికి అతిపెద్ద పార్టీగా నిలిచి నగర పీఠం దక్కించుకుని సంతృప్తికరమైన ఫలితం వచ్చినా, తెలంగాణలో పాగా వేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న కమలానికి మాత్రం ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పాలి.
తెలంగాణలో తనని కొట్టేవాడే లేరనుకున్న టీఆర్ఎస్‌కు గ్రేటర్‌లో ముచ్చెమటలు పట్టడానికి కారణాలు ఏంటి.. ఎన్నికలు అనగానే ముందుగా అపోజిషన్ పార్టీలకు ఊపిరి సలపే చాన్స్ ఇవ్వకుండా చేయడం టీఆర్ఎస్ ప్రధాన ఎత్తుగడ. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎత్తుగడతోనే విజయాలు సాధించారు. అయితే ఈసారి మాత్రం ఆ ఎత్తుగడను అమలు చేయడానికి టైమ్ లేకుండా పోయింది.
అయినా కూడా 90 సీట్లు ఖాయమనుకున్న టీఆర్ఎస్ పెద్దలకు షాక్ ఇచ్చాయి గ్రేటర్ ఫలితాఉ. మరోవైపు హైదరాబాద్ నగరంలో అసలు బీజేపీ ఇంతలా పుంజుకోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు తెరపైకి వస్తున్నాయి. వాటిలో మొదటిది ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత, రెండోది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నిస్సహాయత, మూడోది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే పార్టీలు మనుగడలో లేకపోవడం.
ఈ మూడు కారణాలే నగర ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడానికి ముఖ్య కారణాలు అయ్యాయి. ఉచితాలతో గ్రామీణ ప్రజల్ని ఆకట్టుకున్న టీఆర్ఎస్ పట్టణ, నగరాల్లో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల్ని విస్మరించడం. కోవిడ్ టైమ్‌లో అయితే గ్రామీణ జీవితం కన్నా హైదరాబాద్ నగరజీవితం బాగా దెబ్బతింది. ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజలు రోగభయంతో అల్లాడి పోతే, బస్తీల్లో నివశించే పేద వర్గాల వారు జీవనోపాధిలేక విలవిల్లాడారు. దీంతో ఆ డివిజన్లలో టీఆర్ఎస్ మట్టికరిచింది.
ఇక ప్రభుత్వ వ్యతిరేకతను ప్రదర్శించాలంటే ప్రజలకు ప్రత్నామ్నాయం కనిపించాలి.. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రస్ ఆ స్థితిలో లేకపోవడంతో బీజేపీకి మరింత కలిసి వచ్చింది. దీంతో వెంటనే ఆ స్థానంలో జొరబడిన బీజేపీ అధికార పార్టీకి ప్రత్నామ్నాయం తామే అని ప్రజల్లో నమ్మకం పొందింది. దాని ఫలితమే దుబ్బాక ఉపఎన్నిక రిజల్ట్. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ ఉలిక్కిపడగా.. తొలిసారి కేసీఆర్ కిందా మీదా పడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక కొన్ని పార్టీలు ఎన్నికల్లో బరిలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి అధికారపార్టీకి మేలు చేస్తాయి. అయితే గ్రేటర్‌లో ప్రభుత్వ వ్యతిరేక వోటు చీల్చుకుని మనుగడ సాధించడానికి ఆంధ్రపార్టీలు బరిలోకి దిగకపోగా, తెలుగుదేశం వున్నా లేనట్లే కనిపించింది. దీంతో నగరంలో పట్టు సాధించి తన ఉనికి చాటేందుకు వెయిట్ చేస్తున్న బీజేపీకి జాగా దొరికింది. ఈ మూడు కారణాలే నగర ఎన్నికల్లో బీజేపీ పాచికాలు పారడానికి ప్రధాన కారణాలు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.