సీమాంధ్ర రాజకీయ నేత, సర్వేల పేరుతో హల్ చల్ చేసే లగడపాటి రాజగోపాల్ తాజాగా తెలంగాణలో రెండు సీట్లలో ఎవరు గెలవబోతున్నారు అన్నదానిపై ఫలితాన్ని విడుదల చేశారు. లగడపాటి రాజగోపాల్ రాజకీయంగా ఎంతగా అభాసుపాలైనప్పటికీ సర్వేల విషయంలో మాత్రం కొంత పక్కాగానే సమాచారం ఇస్తుంటారని జనాల్లో టాక్ ఉంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం లగడపాటి రాజగోపాల్ తిరుపతి నగరంలో తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతూ రెండు సీట్లలో ఎవరు గెలుస్తారో వివరణ ఇచ్చారు. ఆయన వెల్లడించింది రెండు సీట్ల వ్యవహారమే అయినా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైనట్లు కనబడుతున్నది. రెండు సీట్ల ఫలితాలు వెల్లడిస్తే టిఆర్ఎస్ కు గుబులెందుకు అనుకుంటున్నారా? చదవండి.
లగడపాటి రాజగోపాల్ సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని తెలుగు ప్రజల్లో ఒక చర్చ ఉంది. లగడపాటి 2014 ఎన్నికల సమయంలో చేసిన సర్వే వివరాలు ఫలితాలకు సరితూగాయి. దీంతో అప్పటి నుంచి లగడపాటి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సర్వేలు చేయించి ఫలితాలు వెలువరిస్తున్నారు. చాలా వరకు లగడపాటి సర్వేలు నిజమైన దాఖలాలున్నాయి. దీంతో లగడపాటి సర్వేలకు మాంచి డిమాండ్ ఏర్పడింది. తెలంగాణలో కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకోగానే కొందరు ఆకతాయిలు లగడపాటి సర్వే ఫలితాలు ఇవే అంటూ తమకు అనుకూలంగా ఫలితాలను రాసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు. అవి కాస్తా వైరల్ గా మారాయి. ప్రత్యర్థి పార్టీల వర్కర్స్ కూడా తమకు అనుకూలంగా సర్వే ఫలితాలు ఇవే అంటూ సర్కులేట్ చేశారు. దీంతో లగడపాటి జోక్యం చేసుకున్నారు. తాను సర్వే ఫలితాలు వెలువరించలేదని స్పష్టంగా మీడియా ముందు చెప్పారు.
అంతేకాకుండా తాను సర్వే చేశానని, కానీ డిసెంబరు 7వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాతే తాను సర్వే ఫలితాలను రిలీజ్ చేస్తానంటూ లగడపాటి మెలిక కూడా పెట్టారు. లగడపాటి సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయబ్బా అని జనాల్లో మాత్రం తీవ్రమైన ఆసక్తి నెలకొంది. తిరుపతిలో ఇవాళ రెండు సీట్లకు లగడపాటి సర్వే పలితాలను వెలువరించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలో కూటమి రెబల్ గా ఉన్న శివకుమార్ రెడ్డి గెలుస్తాడని లగడపాటి చెప్పారు. శివకుమార్ రెడ్డి గతంలో టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ లో ఆయనకు సీటు రాలేదు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన వామనగిరి కృష్ణకు మళ్లీ టికెట్ దక్కింది. దీంతో రెబెల్ గా పోటీ చేశారు శివకుమార్ రెడ్డి. బిఎల్ఎఫ్ శివకుమార్ కు మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఆయనే గెలవబోతున్నట్లు లగడపాటి చెప్పారు.
అలాగే ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అనీల్ జాదవ్ గెలుస్తారని లగడపాటి సర్వే ఫలితం వెల్లడించారు. బోధ్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు సీటు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సోయం బాబూరావు పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి రాథోడ్ బాబూరావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనీల్ జాదవ్ మీద రాథోడ్ బాపూరావు గెలిచారు. ఇప్పుడు అనీల్ కు నియోజకవర్గంలో మాంచి పట్టుంది. అయినా ఆయనకు సీటు రాలేదు. దీంతో రెబెల్ గా బరిలో ఉన్నారు. అయితే ఈ సీటులో అనీల్ కే జనాలు ఓటేసి గెలిపిస్తున్నారని లగడపాటి తన సర్వే ఫలితంగా వెల్లడించారు.
అయితే అసలు విషయం ఏమంటే ఈ రెండు సీట్లలో గెలవబోతున్నవారు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులే కావడం గమనార్హం. రేపు మరో రెండు సీట్లలో లగడపాటి రెబెల్స్ గెలిచే స్థానాలు ప్రకటిస్తానని చెప్పారు. దీన్నిబట్టి కాంగ్రెస్ రెబెల్స్ అంటే ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తోక అన్నమాట. మరి తోక స్థానంలో ఉన్న రెబెల్స్ గెలిచినప్పుడు తల స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకెంత మెజార్టీతో గెలుస్తుంది అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినవారు 10 మంది గెలుస్తారని లగడపాటి లెక్క చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ఎక్కువమంది రెబెల్స్ కూటమి వారే బరిలో ఉన్నారు. అంటే ఈలెక్కన జనాల మూడ్ కాంగ్రెస్ కూటమి వైపే ఉందన్న అంచనాల్లో కాంగ్రెస్ నేతలు మునిగిపోయారు.
లగడపాటి రాజగోపాల్ ప్రభుత్వ రద్దు ప్రకటన రాగానే సర్వే చేశారని, కానీ ఆ సర్వే ఫలితం టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టే దాన్ని బయటకు తీయలేదని కాంగ్రెస్ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. లగడపాటి రాజగోపాల్ పచ్చి తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడ్డారు కాబట్టి ఇప్పుడు సర్వేల్లో టిఆర్ఎస్ గెలవడంలేదని చెబితే టిఆర్ఎస్ వాదుల నుంచి వచ్చే వత్తిడి తట్టుకోవడం కష్టమన్న భయంతోనే ఆయన సర్వే ఫలితాలు వెలువరించలేదన్న చర్చ ఉంది. మరోవైపు లగడపాటికి తెలంగాణలో ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఆస్తుల పరిరక్షణ కోసమే ఇటీవల సిఎం కేసిఆర్ ను ప్రగతి భవన్ కు వెళ్లి మరీ కలిశారన్న విమర్శ ఉంది. పెళ్లికార్డు ఇచ్చేందుకు కేసిఆర్ ను కలిసినట్లు వార్తలొచ్చాయి.
అదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని జోక్స్ కూడా సర్కులేట్ అయ్యాయి. తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాం కు అపాయింట్ మెంట్ దొరకదు కానీ తెలంగాణ వ్యతిరేకి లగడపాటికి కేసిఆర్ ప్రగతిభవన్ లో అపాయింట్ మెంట్ ఈజీగా దొరికింది అని తెలంగాణవాదులు సెటైర్స్ కూడా వేశారు. మరి డిసెంబరు 7వ తేదీ తర్వాత లగడపాటి ఏరకమైన సర్వే ఫలితాలు వెలువరిస్తారో చూడాలి.