తెలంగాణ టైమ్స్.! కేసీయార్‌కి వెన్నుపోటు భయం.?

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్లు దక్కించుకున్న కొందరు నేతలు, వైసీపీలోకి దూకెయ్యడం చూశాం. ఎన్నికల సమయంలో ఇలాంటి చిత్రాలు విచిత్రాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.

తెలంగాణలోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పార్టీ మారే ఆలోచనలో వున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు గులాబీ బాస్ కేసీయార్, టిక్కెట్టు కూడా ఖరారు చేశారు. చిత్రంగా మైనంపల్లి, కేసీయార్ మేనల్లుడు, మంత్రి హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

మైనంపల్లి ఆరోపణల్ని మంత్రి కేటీయార్ ఖండించిన సంగతి తెలిసిందే. గులాబీ నేతలు, మైనంపల్లిపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మైనంపల్లి, కాంగ్రెస్ అలాగే బీజేపీలతో టచ్‌లోకి వెళుతుండడం గమనార్హం. పార్టీ మారే ఆలోచనలోనే వున్నారాయన.

అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది.? హరీష్ రావు ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి కేసీయార్ ప్రయత్నిస్తున్నారా.? మైనంపల్లితో నాటకం ఆడిస్తున్నారా.? ఒకవేళ అదే నిజమైతే, ఎన్నికల సమయంలో కేసీయార్ ఇంత రిస్క్ ఎందుకు చేస్తారు.? ఆ ఛాన్సే లేదు.

మైనంపల్లి హన్మంతరావు మాత్రమే కాదు, మరికొందరు గులాబీ నేతలు.. అందునా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కేసీయార్‌కి హ్యాండిచ్చే ఆలోచనలో వున్నారట. ఇది ముమ్మాటికీ, వెన్నుపోటు రాజకీయమే.. అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో కేసీయార్‌కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదురుచెప్పడమంటే అది సాహసోపేతమైన చర్యే.!