పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన టీడీపీ.!

కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ కలిసిపోయింది.! ఇది తెలంగాణ రాజకీయం.! ఔను, కొందరు టీడీపీ నేతలు, గులాబీ పార్టీలోకి వెళ్ళిపోతే, ఇంకొందరు హస్తం పార్టీ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడిక తెలంగాణ టీడీపీలో నాయకులు ఎవరున్నారు.? అంటే, చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ మిగల్లేదు.

ప్రజారాజ్యం పార్టీ నుంచి టీడీపీ పతనమవుతూ వచ్చిందని అనొచ్చా.? లేదంటే, అంతకన్నా ముందు కేసీయార్, టీడీపీని వీడటంతో తెలుగుదేశం పార్టీ పతనం షురూ అయ్యిందనాలా.? ఇవేవీ కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతర్థానమవడం మొదలయ్యిందని అనుకోవడమే సబబేమో.!

అలాగని, పై రెండు సందర్భాల్నీ కొట్టి పారేయలేం. తెలంగాణలో అయితే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ దాదాపుగా లేనట్టే. కొందరు చంద్రబాబు సానుభూతిపరులు, తెలంగాణలో టీడీపీ జెండా పట్టుకుని తిరుగుతుండొచ్చుగాక.! కానీ, ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ముచ్చటా వుండదు.

ఎక్కడ చూసినా టీడీపీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీతో కలిసే తిరుగుతున్నాయి. వాస్తవానికి టీడీపీ శ్రేణులు, జనసేన పార్టీకి మద్దతివ్వాలి. జనసేన – బీజేపీ తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న దరిమిలా, కాంగ్రెస్ పార్టీ వైపు టీడీపీ క్యాడర్ వెళుతోందని అనుకోవాలా.? అంతేనేమో.!

‘కాంగ్రెస్ పార్టీతో తెలుగు తమ్ముళ్ళు మమేకమవుతున్నారు..’ అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అంతే కాదు, కాంగ్రెస్ నేతలు కొందరు మెడలో టీడీపీ కండువాలు వేసుకుని కనిపిస్తుండడం గమనార్హం. ఎన్నికల సిత్రాలు ఇలాగే వుంటాయ్. ఎవరి గోల వారిది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వైపు టీడీపీ వుంటుందా.? కాంగ్రెస్‌ని టీడీపీ నమ్ముకుంటుందా.? అంటే, ప్రస్తుతానికైతే సమదూరం పాటిస్తున్నారట. కాదు కాదు, రెండిటితోనూ తెరవెనుకాల ‘సమానమైన రీతిలో’ సంబంధాలు కొనసాగిస్తోంది టీడీపీ.! టీడీపీ అవసరం అలాంటిది మరి.!

ఏమో, ముందు ముందు కాంగ్రెస్‌లో టీడీపీ విలీనమైపోతుందేమో కూడా.! తెలంగాణలోనేనా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడానా.?