తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్…

తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పడతామని సెర్ప్ ఉద్యోగులు సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. సమ్మెతోపాటు కుటుంబసభ్యులతో కలిసి ఆమరణ నిరహారదీక్షకు దిగుతామని ప్రకటించారు. దీంతో తెలంగాణ సర్కారు కదిలింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కసరత్తు తీవ్రతరం చేశారు.

నిజామాబాద్ ఎంపి కవిత కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. బుధవారం సెర్ప్ ఉద్యోగులు మంత్రి జూపల్లి, కవితను కలిసి తమ సమస్యలపై చర్చించారు. దానికి కవిత, మంత్రి సానుకూలంగా స్పందించారు. తమ ఐదు డిమాండ్లపై శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశముందని సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజానికి సెర్ప్ ఉద్యోగులు ఈనెల 30వ తేదీ వరకే సర్కారుకు డెడ్ లైన్ విధించారు. 30వ తేదీ తర్వాత ఏ క్షణమైనా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగడమే కాకుండా కుటుంబాలతో ఆమరణ దీక్షకు దిగుతామన్నారు. ఈ నేపథ్యంలో సర్కారులో కలదలిక రావడంతో ఇంకొక రోజు వేచి చూసే ధోరణిలో సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు ఉన్నారు. 

అయితే గురువారం అధికార వర్గాలు తమ సమస్యలపై కసరత్తు చేసినట్లు జెఎసి నేతలు తెలిపారు. ఇప్పటికే అడ్వకెట్ జనరల్ నుంచి ఒపీనియన్ కూడా అందిందని, శుక్రవారం ఉదయం 10, 11 గంటల సమయంలో తెలంగాణ సిఎంఓ కు తమ ఫైల్ చేరవచ్చని అధికార వర్గాలు అనధికారికంగా జెఎసి నేతలకు సమాచారాన్ని చేరవేశాయి.

శుక్రవారం పరిణామాలు ఎలా ఉంటాయా అని జెఎసి నేతలు టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. శుక్రవారం అన్నీ అనుకున్నట్లు జరిగితే తమ సమ్మె ప్రకటన విరమించుకుంటాం. లేదంటే సమ్మె తప్పదు అని జెఎసి నేతలు అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే శనివారం అంటే సెప్టెంబరు 1వ తేదీన సెర్ప్ ఉద్యోగుల జెఎసి రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్ లో జరపాలని నిర్ణయించారు. 

శుక్రవారం నాటి పరిణామాలను బేరీజు వేసుకుని శనివారం సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే దిశగా జెఎసి నేతలు కదులుతున్నారు. తమ డిమాండ్లు ఒప్పుకుంటే ప్రభుత్వంపై కేవలం ఏటా రు.84కోట్లు మాత్రమే అదనపు భారం పడుతుందని వారు మరోసారి తేల్చి చెప్పారు.  

సెర్ప్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ఎంపి కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఉద్యోగ జెఎసి నేతలు తెలిపారు. ఆమె అలాగే తమ సమస్యలపై చివరి వరకు సహకరించి పని చేయాలని సెర్ప్ ఉద్యోగులు కోరుతున్నారు.  తమ సమస్యల విషయంలో మంత్రి జూపల్లితో పాటు సిఎం కేసిఆర్ ను కలిసి చర్చిస్తానని ఆమె జెఎసి నేతలకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. 

శుక్రవారం జెఎసి రాష్ట్ర స్థాయి సమావేశం ఎక్కడ జరుగుతుంది, ఏంటి అనే సమాచారాన్ని ఇప్పటికే అన్ని జిల్లాల నేతలకు అందజేసినట్లు జెఎసి నేత గంగాధర్ తెలిపారు.  మొత్తానికి ఈ సమస్యకు ఏరకమైన పరిష్కారం దొరుకుతుందోనని తెలంగాణలోని 4వేల పైచిలుకు సెర్ప్ ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనతో టెన్షన్ టెన్షన్ గా గడుపుతున్నారు. శుక్రవారం పరిణామాలు ఏరకంగా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.