తెలంగాణ సెర్ప్ ఉద్యోగులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. టిఆర్ఎస్ సర్కారు హామీలివ్వడమే కాదు అమలు చేస్తామని చివరి నిమిషం వరకు నమ్మించి మోసం చేశారని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో తాము సమ్మె బాట పట్టకుండా నిలువరించి తుదకు ఒక్క హామీ కూడా అమలు చేయకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారని వారు బాధపడుతున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో నాలుగువేల మంది సెర్ప్ ఉద్యోగుల గురించి ఆలోచించేందుకు పది నిమిషాల టైం కూడా సర్కారుకు దొరకలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం సెర్ప్ ఉద్యోగులు తెలంగాణ సర్కారుకు గత నెలలో సమ్మెనోటీసు ఇచ్చారు. సమ్మెకు సిద్ధమవుతున్నవేళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి స్పందించి అన్ని హామీలు అమలవుతాయి… సమ్మె అవసరం లేదంటూ తియ్యటి మాటలు చెప్పారని సెర్ప్ ఉద్యోగ సంఘం నేత ఒకరు తెలిపారు. సెర్ప్ ఉద్యోగుల పే స్కేల్ డిమాండ్ తో పాటు మిగతా అంశాలపై కేబినెట్ లో టేబుల్ ఐటమ్ గా ఇంట్రడ్యూస్ చేసినట్లు ఉద్యోగులకు చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2వ తేదీనే కేబినెట్ కు తమ ఫైల్ చేరిందని మంత్రి తెలిపారన్నారు. ఆగస్టు 6వ తేదీన ప్రభుత్వ రద్దు కంటే ముందే తమ ఫైల్ పరిశీలనలో ఉంది కాబట్టి ఆ ఫైలు పై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ ను కలిసే యోచనలో సెర్ప్ ఉద్యోగులు ఉన్నారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఖజానాపై 84 కోట్ల భారం పడుతుందని సూచిస్తే 84 కోట్లతో కాకుండా ఉన్నతాధికారులతో 104 కోట్లతో ప్రతిపాదనలు తెప్పించుకున్నారని గుర్తు చేశారు. అడిగినదానికంటే ఎక్కువగానే ఇస్తారేమోనన్న ఆశతో తాము సమ్మెకు దిగలేదన్నారు. కానీ తమకు మొండి చేయి చూపారన్నారు. 84 కోట్ల ప్రతిపాదనలు కాదని 104 కోట్లతో ప్రతిపాదనలు కోరిన సమయంలో తాము సమ్మెకు పోవడం సాధ్యం కాదు కాబట్టి వెనకడుగు వేశామన్నారు. తీరా అదిగో, ఇదిగో అంటూ అసెంబ్లీ రద్దు వరకు నాన్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో సిఎం, మంత్రి చివరి నిమిషం వరకు తమకు న్యాయం జరుగుతుందంటూ నమ్మించారని, అంతిమంగా తమకు అన్యాయం జరిగిపోయిందని చెప్పారు. సిఎం కేసిఆర్ ప్రకటన చేస్తారని చివరి నిమిషం వరకు తమకు ఆశ పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన తమకు తొలి తెలంగాణ ప్రభుత్వాధినేత కేసిఆర్ ఇచ్చిన బహుమతి ఇదేనా ఆయన ప్రశ్నించారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న సమయంలో తామందరినీ సమైక్య ప్రభుత్వం ఒక్క కలం పోటుతో టర్మినేట్ చేసిందని ఉద్యోగ జెఎసి నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
సకల జనుల సమ్మె కాలంలో తాము ఉన్న సమయంలో తమకు ఉమ్మడి సర్కారు సెర్ప్ ఉద్యోగుల అన్ని హామీలు అమలు చేస్తామని రాతపూర్వకంగా ఆశ పెట్టినా తెలంగాణ కోసం చివరి రోజు వరకు కూడా సమ్మెలో పాల్గొన్నామని చెప్పారు. ఆ సమయంలో ఉమ్మడి పాలకులు ఆఫర్ లెటర్లతో ఆశ చూపినా వెనుకడుగు వేయలేదన్నారు. దాంతో తామందరినీ టర్మినేట్ చేశారని చెప్పారు. అనంతరం కేటిఆర్ నాయకత్వంలో ఆల్ పార్టీ నేతలు ఉన్నతాధికారుల మీద వత్తిడి తెచ్చి తిరిగి ఉద్యోగాల్లో చేర్పించారని గుర్తు చేశారు. ఇప్పటి తమ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు అప్పడు కాంగ్రెస్ పార్టీ తరుపున ఆల్ పార్టీ సమావేశానికి వచ్చారని గుర్తు చేసుకున్నారు.
ఉమ్మడి పాలకుల తాయిలాలకు లొంగకుండా తెలంగాణ కోసం సెర్ప్ ఉద్యోగులు సమ్మెలో ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సమావేశం మాత్రం సెర్ప్ ఉద్యోగుల కోసమే జరిపినట్లు చెప్పారు. కానీ ఆ సమావేశంలో తీసుకున్న ఏ నిర్ణయం కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాకపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం జరగబోతుందన్న ప్రచారం బయటకు వచ్చిన నేపథ్యంలో తాము సమ్మెబాట పట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఎంపి కవిత నిలువరించారని గుర్తు చేశారు. కానీ అంతలోగా అసెంబ్లీ రద్దు జరిగిపోయిందన్నారు. ఇప్పుడు తమ పరిస్థితి మింగలేక కక్కలేక ఉన్నట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గవర్నర్ ను కలిసే యోచనలో సెర్ప్ జెఎసి
టిఆర్ఎస్ సర్కారు తమను నమ్మించి మోసం చేసిందన్న ఉద్దేశంలో ఉన్న సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో ఫైనాన్సియల్ మ్యాటర్స్ కాకుండా మిగిలిన కొన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు అవసరమైతే గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నట్లు జెఎసి నేత తెలిపారు. జరిగిన పరిణామాలను, తమకు ఎలా అన్యాయం జరిగిందో గవర్నర్ కు విన్నవించుకుంటే ఫలితం ఉంటుందేమో అన్న ఆశతో ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే జెఎసి సమావేశమై గవర్నర్ ను కలిసే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
మొత్తానికి తెలంగాణలో ఉన్న 4వేల మంది సెర్ప్ ఉద్యోగులు టిఆర్ఎస్ తీరు పట్ల గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆపద్ధర్మ సిఎం ఉన్న నేపథ్యంలో కొత్త సర్కారు వచ్చిన తర్వాతే సెర్ప్ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న చర్చ ఉంది.