తెలంగాణలో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెర్ప్ ఉద్యోగులు టిఆర్ఎస్ సర్కారు మీద గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ వారి చర్చలు సాగుతున్న క్రమంలోనే ఆగమేఘాల మీద కేసిఆర్ తన సర్కారును రద్దు చేసుకున్నారు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో వారి సమస్యలు అలాగే పెండింగ్ లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సెర్ప్ ఉద్యోగుల జెఎసి కీలక నిర్ణయం తీసుకుంది. తమ డిమాండ్లు మ్యానిఫెస్టోలో చేర్చి, పరిష్కరించే వారికే సెర్ప్ సిబ్బంది మద్దతు ఉంటుందని విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు సెర్ప్ జెఎసి నేతలు ఏపూరి నర్సయ్య, గంగాధర్, సుభాష్, మహేందర్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు చదవండి.
సర్వీసు రెగ్యులర్ చేయడం సహా మహిళా సంఘాల డిమాండ్లు మ్యానిఫెస్టోలో చేర్చి, పరిష్కరించే వారికే సెర్ప్ సిబ్బంది మద్దతు వుంటుందని సెర్ప్ జెఎసి నేతలు తెలిపారు. 18సం. లు గ్రామీణ ప్రాంతాల్లో 51 లక్షల మంది మహిళల సంక్షేమం కోసం తాము అనునిత్యం పని చేస్తున్నామన్నారు. గ్రామీణ అభివృద్ధి పథకాల అమలు కోసం సెర్ప్ సంస్థ లోని 4258 మంది సిబ్బంది చాలీచాలని వేతనాలతో, నామమాత్రపు ఉద్యోగ భద్రత తో అహర్నిశలు కృషి చేస్తున్నా ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు.
తెలంగాణ ఉద్యమం లో 51 లక్షల మహిళలు పాల్గొనేలా చేసి, స్వరాష్ట్ర సాధన కోసం కీలక భూమిక పోషించామన్నారు, ముఖ్యంగా
ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె ను అన్ని సంఘాలు మధ్యలో విరమిస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామన్నా కూడా సెర్ప్ సిబ్బంది సమ్మె విరమణ చేయలేదన్నారు, దీంతో ఆంధ్ర అధికారులు 1556 సర్క్యులర్ తో మొత్తం సెర్ప్ సిబ్బంది ని టెర్మినేట్ చేశారని గుర్తు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున ఉద్యమించగా, తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి మద్దతు, అన్ని పార్టీల మద్దతు తో తిరిగి ఉద్యోగాలు పొందామని గుర్తు చేశారు.
51లక్షల మహిళా సంఘాల సభ్యులతో ఇంతటి గొప్ప నెట్ వర్క్ , ఇంత గొప్ప త్యాగ చరిత్ర ఉన్న సెర్ప్ సిబ్బంది, మహిళా సంఘాల కు సంబంధించి ఈ క్రింద పేర్కొన్న డిమాండ్లు మ్యానిఫెస్టోలో చేర్చడం తోపాటు , తప్పనిసరి పరిస్థితుల్లో అధికారంలోకి రాగానే తొలిసంతకం చేసి అమలు చేస్తామని ఎన్నికల్లోని అన్ని సభావేదికలపై బలమైన హామీ ఇచ్చే పార్టీలకే మా మాద్దతు ఇస్తామని వారు తమ పత్రిక ప్రకటనలో వెల్లడించారు.
సెర్ప్ జెఎసి లేవనెత్తిన డిమాండ్లు ఇవే
1) సెర్ప్ సంస్థ లో పనిచేస్తున్న 4258మంది సిబ్బంది సర్వీసులు బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి, సిబ్బంది కి సెర్ప్ జెఎసి ఇదివరకే పలుమార్లు ప్రతిపాదించిన క్యాడర్ ఫిక్షేషన్ చేసి, 104 కోట్ల తో పేస్కెలు అమలు చేయాలి,
2)మహిళా సంఘాల కు రు.15లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.
3)మహిళా సంఘాల సభ్యులకు రు.5లక్షల భీమా వర్తింపు చేయాలి.
4) మండల సమాఖ్య లను భ్యాంకులుగా గుర్తించి రు 2కోట్ల గ్రాంటు మంజూరు చేయాలి.
5) సెర్ప్ సిబ్బందికి ప్రభుత్వం ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి.