నిజామాబాద్ ఎంపీ కవితకు  షాక్.. ఆ స్థానం నుంచి ఎంపీగా పోటి చేయనున్న 1000 మంది రైతులు

నిజామాబాద్ ఎంపీ కవితకు పెద్ద చిక్కులు రాబోతున్నాయి. గత కొంత కాలంగా నిజామాబాద్, జగిత్యాల, ఆర్మూర్ కరీంనగర్ ప్రాంతాలకు చెందిన పసుపు, ఎర్రజొన్న రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులంతా కలిసి జేఏసీగా ఏర్పడ్డారు. జేఏసీ ఆధ్వర్యంలో 20 రోజులుగా రోజుకో తీరున తమ నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంత వరకు స్పందించలేదు. దీంతో రైతులు కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ ఉద్యమం దేశమంతా చూసేలా నిర్ణయం తీసుకున్నారు.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి దాదాపు 200 గ్రామాల నుంచి 1000 మంది రైతులు పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. పోటికి సంబంధించి నామినేషన్ ఫీజును గ్రామ కమిటీల ద్వారా చందాలుగా వసూలు చేయాలని నిర్ణయించారు. తాము గెలవాలని కాదని తమ పరిస్థితి దేశమంతటికి తెలియజెప్పేలా చేయడమే తమ లక్ష్యమని రైతులు అన్నారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్న స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

నిజామాబాద్ రైతులు నల్లగొండ ప్రజలు చూపించిన బాటలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో నల్లగొండ జిల్లాలోని ఎస్సెల్బీసీ కాలువను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు ఎంత ఉద్యమించినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆ రైతులంతా పార్లమెంటు ఎన్నికల్లో పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. 1996 లో నల్లగొండ ఎంపీ స్థానానికి 480 మంది రైతులు నామినేషన్ వేశారు. దీంతో అది అప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడు ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల మీదనే జరిగాయి. దీంతో దేశమంతా ఎన్నికలు జరిగినా నల్లగొండ ఎన్నికలు మాత్రం నెల ఆలస్యంగా జరిగాయి. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా తయారు చేయాలి కదా. అలా చేసినా కూడా ప్రజలంతా చాలా జాగ్రత్తగానే ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో సీపీఐ నుంచి బొమ్మగాని ధర్మభిక్షం రెండో సారి ఎంపీగా ఎన్నికయ్యారు. చెల్లని ఓట్లు కూడా చాలా తక్కువగానే ఉండడం గమనార్హం. 

ఆ తర్వాత 2009 లో మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ బాధితులు తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో మహబూబ్ నగర్ స్థానానికి పోటి చేశారు. దాదాపు 16 మంది బాధితులు నామినేషన్ వేశారు. తమ సమస్య పరిష్కారం కోసం వారు ఈ విధంగా వినూత్నంగా నిరసన చేపట్టారు. అప్పుడు కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ రైతులు కూడా తమ సమస్య పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. నిజంగానే 1000 మంది రైతులు నామినేషన్ వేస్తే ఇది దేశంలోనే రికార్డు కానుంది.