తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేసేందుకు ఏకంగా వెయ్యిమంది సిద్ధమవుతున్నారు. కవితపై పోటీకి దిగబోతున్నవారందరూ రైతులు కావడం గమనార్హం. కవితపై తమ నిరసనను తెలిపేందుకు ఈ సరికొత్త పంథాను ఎంచుకున్నారు.
పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కవితపై మూకుమ్మడిగా పోటీకి దిగాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కనీసం 500 నుంచి వెయ్యి వరకు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.
నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో తనపై 1000 మంది పోటీ చేయనున్నారని వచ్చిన వార్తలపై ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరికైనా అర్హత ఉందని ఆమె వ్యాఖ్యానించారు. జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలు ఈనాటివి కావని, దశాబ్దాల పాటు పరిపాలించిన ఆంధ్రా పాలకుల వైఖరి వల్లే వచ్చినవని అన్నారు.
ఈ ఉదయం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం చూస్తున్న రైతు సంఘాలతో చర్చిస్తానని చెప్పారు. ఇండియాకన్నా చిన్న దేశాలు, పేద దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వ్యాఖ్యానించిన కవిత, కొందరి వైఖరితోనే ఇండియా వెనుకబడివుందని అన్నారు. జాతీయ స్థాయిలో సైతం కేసీఆర్ వంటి నేతల అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
బీజేపీకి అధికారం ఇస్తే, ఒకసారి నోట్లు, మరోసారి టాక్స్ మార్చారని, వందలసార్లు మాట మార్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు తప్ప బీజేపీకి గుడి గురించిన ఆలోచనే రాదని విమర్శలు గుప్పించారు. ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలకు జరిగిన మంచి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పుల్వామాలో దాడి జరిగితే, మరణించిన జవాన్లకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ప్రకటించిన ఏకైక సీఎం కేసీఆరేనని, బీజేపీ పాలిత రాష్ట్రాలు అమర జవాన్లకు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు.