కోదండరాం కు చుక్కలు చూపించిన తెలంగాణ పోలీసులు (వీడియో)

తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం కు తెలంగాణ పోలీసులు మరోసారి చుక్కలు చూపించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో  గన్ పార్కు వద్ద, తన పార్టీ ఆఫీసులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరారు కోదండరాం. అక్కడ నీటి విడుదల కోసం ఆందోళన చేసి అరెస్టయి జైలులో ఉన్న రైతులను పరామర్శించేందుకు కోదండరాం పర్యటన జరగాల్సి ఉంది. అయితే బిక్నూరు టోల్ గేట్ వద్ద పోలీసులు కోదండరాం ను అరెస్టు చేశారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని కోదండరాం వారిని నిలదీశారు. అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ముందస్థు అరెస్టు అని పోలీసులు చెప్పారు. 

ఇదే సమయంలో బిక్నూరు పోలీస్ స్టేషన్ కు కోదండరాం ను తరలించారు పోలీసులు. కొద్దిసేపు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత కోదండరాం ను బలవంంగా పోలీసు జీపు ఎక్కించి హైదరాబాద్ తరలించారు. అయితే తనను ఎందుకు అరెస్టు చేశారు? ఎక్కడికి తరలిస్తున్నారంటూ కోదండరాం పోలీసుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోదండరాం ను దొబ్బుకుంటూ, నెట్టేసుకుంటూ పోలీసు వ్యాన్ ఎక్కించారు. రిటైర్డ్ ప్రొఫెసర్, ఒక రాజకీయ పార్టీకి అధినేత అయినప్పటికీ పోలీసులు అవమానకరంగా కోదండరాం పట్ల వ్యవహరించారని జన సమితి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కోదండరాం ను బలవంతంగా నెట్టుకుపోతున్న వీడియో కింద ఉంది.