షాకింగ్ న్యూస్ : తెలంగాణ జర్నలిస్టుల ఛలో గజ్వేల్

తెలంగాణలో నాలుగేళ్ల టిఆర్ఎస్ పాలనలో జర్నలిస్టులను అవమానకరంగా, హీనంగా చూశారని జర్నలిస్టులు ఫైర్ అయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన జర్నలిస్టు సంఘాలు వెన్నెముక చితికిపోయి కూలబడిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగునేల మీద ఎన్నడూ లేనంతగా జర్నలిస్టులు తెలంగానలో అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్న అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా సాగుతున్న నిరంకుశ పాలనపై పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27వ తేదీన ఛలో గజ్వేల్ కు జర్నలిస్ట్స్ ఫోరం టు సేవ్ తెలంగాణ పిలుపునిచ్చింది. పూర్తి వివరాలు ఇవి.

హైదరాబాద్ లో జర్నలిస్ట్స్ ఫోరం టు సేవ్ తెలంగాణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో ప్రభుత్వం జర్నలిస్టులను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. కీలకమైన జర్నలిస్టు సంఘాల్లో నేతలు పైరవీలు, పదవుల కోసం పాకులాడుతూ జర్నలిస్టుల ప్రయోజనాలను పాలకుల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు లోకమంతా టిఆర్ఎస్ జేబులో పెట్టేందుకు ప్రయత్నం చేశారని మండిప్డడారు. ప్రశ్నించడమే నేరంగా భావిస్తున్న టిఆర్ఎస్ సర్కారుపై పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ అమర్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఈనెల 27వ తేదీన ఛలో గజ్వేల్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలు, అవమానాలను గజ్వేల్ వేదికగా గొంతెత్తి సమాజానికి తెలియజేయాలని నిర్ణయం తసుకున్నారు. 27న గజ్వేల్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశం ద్వారా తెలంగాణలో పాలన ఎలా ఉంది? ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందన్న సంకేతాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని సంకల్పించారు.

సమావేశంలో జమలాపూర్ గణేష్, రామకృష్ణ, సతీష్ కమాల్, రాజేందర్, నగేష్, గోపి యాదవ్, మధుసూదన్ రావు, అమిత్ భట్, విజయ్, సాబేర్, నాగరాజు మాట్లాడారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని పోరుబాట పట్టిన జర్నలిస్టుల చైతన్యం ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేయాలని నిర్ణయించారు. బంగారు తెలంగాణ ప్రభుత్వంలో చైతన్యానికి మారుపేరైన తెలంగాణ జర్నలిస్టుల వెన్నెముక చితికిపోయిందా అన్న అనుమానం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలక పక్షం వారు జర్నలిస్టుల కోసం ఇచ్చి హామీలు అమలు చేయండి అని ప్రశ్నించే స్థితిలో కూడా జర్నలిస్టులు చైతన్యం ప్రదర్శించకపోవడం ఆందోళనకరమన్నారు. ఆరోగ్య కార్డులు జారీ చేస్తే కేటిఆర్ కు జిందాబాద్ లు కొట్టడం దౌర్భాగ్యమన్నారు. అక్రిడేషన్లు జారీ చేస్తే కేసిఆర్ కు పాలాభిషేకం చేయడంతో జర్నలిస్టు సంఘాలు దిగజారిపోయాయని మండిపడ్డారు. తమ పైరవీల కోసం తమ పదవుల కోసం, తమ టికెట్ల కోసం యావత్ తెలంగాణ జర్నలిస్టు సమాజాన్ని పాలకుల పాదాల చెంత తాకట్టు పెట్టారని కొందరు జర్నలిస్టు సంఘాల నేతల తీరును ఎండగట్టారు.

జర్నలిస్టుల సమస్యలతోపాటు ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పేందుకు తం ఫోరం పనిచేస్తుందని ఆ దిశగా కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పాలకవర్గం వ్యతిరేకిగా ముద్ర వేయడం దారుణమన్నారు.

పాలకులకు యాజమాన్యాలు దాసోహం కావడంతో జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే మీడియాను జనాలు నమ్మే పరిస్థితి లేకుండాపోతుందని అన్నారు. జనాల్లో మెయిన్ స్ట్రీం మీడియా కంటే సోషల్ మీడియా పట్ల నమ్మకం కలిగే పరిస్థితి దాపురించిందన్నారు. గజ్వేల్ సభలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ వంతు ప్రయత్నం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.