ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు చేపట్టిన దీక్షలు విరమణ

తమ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఆందోళనబాట పట్టారు. పాలకులు మాటలతో కాలక్షేపం చేయకుండా తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రిలే నిరహారదీక్షలకు పిలుపునిచ్చారు. అయితే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం హామీ లభించడంతో దీక్షలు విరమించారు. పూర్తి వివరాలు చదవండి.

కడప జిల్లా రాయచోటిలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ జర్నలిస్టుల ఇంటి స్థలాల సాధన సమితి ఆధ్వర్యంలో గత పదిరోజుల నుంచి జర్నలిస్టుులు రిలే నిరహారదీక్షలు చేస్తున్నారు. జర్నలిస్టులు చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షా శిబిరం వద్దకు శనివారం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో ఆయన చర్చలు జరిపారు. 

జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇస్తూ జర్నలిస్టులకు టెంకాయ నీరు తాగించి దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయం పై జిల్లా కలెక్టర్ తో చర్చించి, వర్కింగ్ జర్నలిస్టులకు త్వరగా ఇంటి స్థలాలు మంజూరు చేయించే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ ఛైర్మన్ హుస్సేన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గాజుల ఖాదర్ భాష, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఖాదర్ వలి, నాయకులు కొప్పల గంగిరెడ్డి పాల్గొన్నారు.